Saturday, November 16, 2024

బెంగళూరుకు కీలకం.. నేడు సన్‌రైజర్స్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరు ఆడనుంది. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా హైదరాబాద్‌కు ఒరిగేదేమీ ఉండదు. అయితే బెంగళూరుకు మాత్రం ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలవక తప్పదు.

ఈ మ్యాచ్‌లోనే కాకుండా ఆఖరి పోరులోనూ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అలా రెండు మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ కోసం ఇతర జట్ల ఫలితాల కోసం బెంగళూరు ఎదురు చూడక తప్పదు. ఇక హైదరాబాద్ ఇప్పటి వరకు కేవలం నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించింది. 8 మ్యాచుల్లో ఓడి టైటిల్ రేసు నుంచి వైదొలిగింది. బెంగళూరు 12 మ్యాచులు ఆడి ఆరింటిలో గెలిచింది. మరో సగం మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇదిలావుంటే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో బెంగళూరు భారీ తేడాతో విజయం సాధించింది. ఇది జట్టుకు అతి పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఇదే జోరును హైదరాబాద్‌పై కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్‌లు జోరుమీదున్నారు. ఈ సీజన్‌లో ఇద్దరు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్‌లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. కెప్టెన్ డుప్లెసిస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మాక్స్‌వెల్ కూడా జోరుమీదున్నాడు. ఈసారి కూడా జట్టు ఈ ముగ్గురిపై భారీ ఆశలు పెట్టుకుంది. మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, బ్రేస్‌వెల్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇక పర్నెల్, సిరాజ్, హర్షల్ పటేల్, మాక్స్‌వెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

పరువు కోసం..
మరోవైపు వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై ఆడుతున్న చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ మార్‌క్రమ్‌తో సహా కీలక బ్యాటర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి తదితరులు పేలవమైన ఆటతో ఇటు అభిమానులను అటు జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశకు గురి చేశారు. హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్‌లు మాత్రమే కాస్త మెరుగైన ప్రదర్శన చేశారు. మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. ఇక ఉప్పల్ వేదికగా గురువారం జరిగే చివరి లీగ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News