Wednesday, January 22, 2025

అదరగొట్టిన సిరాజ్.. బెంగళూరు జయకేతనం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అథర్వా టైడ్ (4)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మాథ్యూ షార్ట్ (8) కూడా ఔటయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన లియామ్ లివింగ్ స్టోన్ (2) కూడా విఫలమయ్యాడు. అతన్ని కూడా సిరాజ్ ఔట్ చేశాడు.

కొద్ది సేపటికే హర్‌ప్రీత్ సింగ్ (13) వెనుదిరిగాడు. దీంతో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పోరాటం కొనసాగించాడు. ధాటిగా ఆడిన సిమ్రాన్ సింగ్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా వారిలో వికెట్ కీపర్ జితేష్ శర్మ (41) మాత్రమే రాణించాడు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 150 పరుగుల వద్దే ముగిసింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో సిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హసరంగాకు రెండు వికెట్లు దక్కాయి.

ఆదుకున్న కోహ్లి, డుప్లెసిస్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు పంజాబ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు కోహ్లి, అటు డుప్లెసిస్ కుదురుగా ఆడడంతో బెంగళూరుకు మెరుగైన ఆరంభం లభించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 59 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన కెప్టెన్ డుప్లెసిస్ ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 56 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు.

ఇక ఓపెనర్లు తొలి వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఓపెనర్లు ఔటైన తర్వాత బెంగళూరు స్కోరులో వేగం తగ్గింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు స్కోరు 174 పరుగులకు పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌ను కనబరిచి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News