Monday, December 23, 2024

ఇరు జట్లకు కీలకం.. నేడు రాజస్థాన్‌తో చెన్నై ఢీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె), రాజస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో రెండేసి విజయాలు సాధించాయి. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన చెన్నై ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. రాజస్థాన్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరుమీదున్న గైక్వాడ్
చెన్నై విజయాల్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ రుతురాజ్ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే మరో ఓపెనర్ డెవోన్ కాన్వే కిందటి మ్యాచ్‌లో సున్నాకే ఔటయ్యాడు. కాన్వే బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇదిలావుంటే కిందటి మ్యాచ్‌లో అజింక్య రహానె కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రహానె సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అంబటి రాయుడు కూడా ఫామ్‌లోకి రావడం చెన్నైకి అతి పెద్ద ఊరట కలిగించే అంశమే. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా రాయుడు సొంతం. అతను విజృంభిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. మరోవైపు రవీంద్ర జడేజా, కెప్టెన్ ధోనీ, శివమ్ దూబే తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక జడేజా, దీపక్ చాహర్, ప్రిటోరియస్, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అంతేగాక సొంత అభిమానుల మధ్య పోరు జరుగుతుండడం కూడా సిఎస్‌కెకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.

గెలుపే లక్ష్యంగా..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా దూకుడు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ జోరుమీదున్నారు. ఈ సీజన్‌లో ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో యశస్వి 31 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇక బట్లర్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో బట్లర్ 79 పరుగులు సాధించాడు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్‌లు విఫలమయ్యారు. వీరిద్దరూ మళ్లీ గాడిలో పడితే రాజస్థాన్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక హెట్‌మెయిర్, అశ్విన్, ధ్రువ జురేల్, హోల్డర్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో పాటు అశ్విన్, హోల్డర్, బౌల్ట్, చాహల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News