Tuesday, November 26, 2024

హైదరాబాద్‌కు చావో రేవో.. నేడు చెన్నైతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే పోరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలకంగా మారింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో చెన్నై మ్యాచ్ హైదరాబాద్‌కు చావోరేవోగా తయారైంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇక సొంత గడ్డపై ఆడుతున్న చెన్నైకి కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై మూడింటిలో విజయం సాధించింది. హైదరాబాద్‌తో పోల్చితే చెన్నై పాయింట్ల పట్టికలో చాలా మెరుగైన స్థానంలో నిలిచింది. సిఎస్‌కె ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో సిఎస్‌కె కనిపిస్తోంది.

బ్యాటింగే బలం..
ఇక ఈ సీజన్‌లో చెన్నై విజయాల్లో బ్యాటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు జోరుమీదున్నారు. ఆరంభ మ్యాచుల్లో రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వరుస అర్ధ సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించాడు. చెన్నై సాధించిన విజయాల్లో రుతురాజ్ తనవంతు పాత్ర పోషించాడు. ఇక కాన్వే కూడా దూకుడుగా ఆడుతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై ఓపెనర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజింక్య రహానె, శివమ్ దూబేలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇద్దరు కూడా సమన్వయంతో ఆడుతూ జట్టుకు మెరుగైన స్కోరును అందించడంలో తమవంతు సహకారం అందిస్తున్నారు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. ఇక రాయుడు కూడా బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశమే. అంతేగాక మోయిన్ అలీ, రవీంద్ర జడేజాల రూపంలో ఇద్దరు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. మహీశ్ తీక్షణ, జడేజా, మోయిన్ అలీ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక హైదరాబాద్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే..
మరోవైపు ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. అంతేగాక కీలక సమయంలో బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇది కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఇక బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం హైదరాబాద్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. హ్యారీ బ్రూక్ ఐదు మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే రాణించాడు. మిగతా మ్యాచుల్లో విఫలమయ్యాడు. రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్‌క్రమ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్, మార్కొ జాన్సెన్, సుందర్ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు ఉన్నా హైదరాబాద్‌కు బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బౌలింగ్‌లో కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో చెన్నై వంటి బలమైన జట్టుతో పోరు హైదరాబాద్‌కు సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News