Thursday, January 23, 2025

ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్.. కోల్‌కతాతో సమరం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కిందటి మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లు శుక్రవారం జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా జట్లు కిందటి మ్యాచ్‌లో జయకేతనం ఎగుర వేశాయి. ఇక ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరుగనుంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే హైదరాబాద్‌తో పోల్చితే కోల్‌కతా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. అంతేగాక సొంత గడ్డపై ఆడుతుండడం కూడా ఆ జట్టుకు సానుకూల అంశంగా చెప్పాలి. కానీ మార్‌క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేంది. పంజాబ్‌పై భారీ తేడాతో విజయం సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది.

బ్యాటింగే అసలు సమస్య..
సన్‌రైజర్స్ టీమ్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణంగా చెప్పొచ్చు. రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, హారి బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, సమద్, మార్‌క్రమ్ వంటి బ్యాటర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా రాహుల్, బ్రూక్, మయాంక్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఆరంభ మ్యాచుల్లో వీరు ఘోరంగా విఫలమయ్యారు. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో కూడా రాహుల్ జట్టుకు కీలకంగా మారాడు. రాహుల్ విజృంభిస్తే జట్టు బ్యాటింగ్ సమస్య చాలా వరకు తీరిపోతోంది. ఇక మినీ వేలం పాటలో కోట్లాది రూపాయల ధరను పలికిన ఇంగ్లండ్ యువ సంచలనం బ్రూక్ ఐపిఎల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. టి20 ఫార్మాట్‌కు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను మార్చుకోవడంలో అతను విఫలమవుతున్నాడు. రానున్న మ్యాచుల్లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే తుది జట్టులో చోటును కాపాడుకోవడం కష్టమే. ఇక మయాంక్ అగర్వాల్ కూడా తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది.

Also Read: అశ్విన్‌కు భారీ షాక్..

ఒకప్పుడూ ఐపిఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన మయాంక్ ఈసారి మాత్రం ఆ స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. సన్‌రైజర్స్‌లో అత్యంత కీలకమైన బ్యాటర్‌గా ఉన్న మయాంక్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, హెన్రిచ్ క్లాసెన్ చేరికతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలంగా మారింది. కెప్టెన్ మార్‌క్రమ్ కూడా కిందటి మ్యాచ్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇది కూడా జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పాలి. ఇక కిందటి మ్యాచ్‌లో బౌలర్లు కూడా సత్తా చాటడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. మయాంక్ మార్కండే పంజాబ్ 15 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

Also Read: ‘ఏజెంట్’ నుంచి ‘రామాకృష్ణా..’ సాంగ్ విడుదల

అందరి కళ్లు రింకు సింగ్‌పైనే
గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన కోల్‌కతా యువ సంచలనం రింకు సింగ్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు రింకు సింగ్‌పైనే నిలిచాయి. గుజరాత్ మ్యాచ్‌లో వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈసారి కూడా రింకు సింగ్ నుంచి కోల్‌కతా ఇలాంటి ఇన్నింగ్స్‌నే ఆశిస్తోంది. మరోవైపు వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, సునీల్ నరైన్, జగదీశన్, ఆండ్రీ రసెల్, గుర్బాజ్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక ఉమేశ్ యాదవ్, శార్దూల్, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్ తదితరులో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News