Monday, December 23, 2024

సన్‌రైజర్స్‌కు పరీక్ష.. నేడు లక్నోతో పోరు

- Advertisement -
- Advertisement -

లక్నో: సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఇక కిందటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన లక్నోకు కూడా ఈ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని జట్టు తహతహలాడుతోంది. మరోవైపు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ చేరికతో సన్‌రైజర్స్ కూడా బలంగా తయారైంది. కొంతకాలంగా బ్యాట్‌తోనే కాక కెప్టెన్సీలోనూ అదరగొడుతున్న మార్‌క్రమ్‌పై సన్‌రైజర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల సౌతాఫ్రికా వేదికగా జరిగిన టి20 టోర్నమెంట్‌లో మార్‌క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఐపిఎల్ టోర్నీలోనూ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

ఇక రాజస్థాన్‌తో జరిగిన తొలి పోరులో హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తికి విఫలమైంది. తొలుత బౌలర్లు, ఆ తర్వాత బ్యాటర్లు తేలిపోవడంతో హైదరాబాద్‌కు ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌లో ఓ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయారు. భారీ ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హారి బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, సుందర్ తదితరులు పూర్తిగా నిరాశ పరిచారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ మాత్మే కాస్త రాణించారు. బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్‌కు రాజస్థాన్ చేతిలో 72 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.

ఆశలన్నీ మార్‌క్రమ్‌పైనే..
ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆశలన్నీ కెప్టెన్ మార్‌క్రమ్‌పైనే నిలిచాయి. ఇటీవల కాలంలో ఫార్మాట్ ఏదైనా మార్‌క్రమ్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కళ్లు చెదిరే శతకంతో ఆకట్టుకున్నాడు. ఐపిఎల్‌లోనూ మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలోనూ అతను రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు విధ్వంసక క్రికెటర్లుగా పేరున్న రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్‌లపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరు కూడా రాణిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. అభిషేక్, మయాంక్, బ్రూక్, సమద్, రషీద్, సుందర్ తదితరులు తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. అయితే నిలకడలేమీ ఒక్కటే జట్టుకు ఇబ్బందిగా మారింది. ఆ లోటును అధిగమిస్తే ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగే ఉండదు.

విజయమే లక్ష్యంగా..
మరోవైపు ఆతిథ్య లక్నో సూపర్‌జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ రాహులతో పాటు మేయర్స్, స్టోయినిస్, కృనాల్, దీపక్, నికోలస్ పూరన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. అంతేగాక మార్క్‌వుడ్, రవి బిష్ణోయి, అవేశ్ ఖాన్, కృష్ణప్ప గౌతం వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News