జైపూర్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరు చావోరేవోగా తయారైంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. ఇలాంటి స్థితిలో హైదరాబాద్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఒత్తిడిని తట్టుకుని విజయాలు సాధించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సన్‌రైజర్స్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హైదరాబాద్‌తో పోల్చితే రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇక హైదరాబాద్‌తో జరిగిన తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం కూడా రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి.
సవాల్ వంటిదే..
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కీలక సమయంలో బ్యాటర్లు ఒత్తిడికి గురి కావడంతో సన్‌రైజర్స్‌కు ఒటమి తప్పలేదు. ఇదిలావుంటే రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నిలకడైన ప్రదర్శన చేయాల్సిన అవసరం సన్‌రైజర్స్‌కు నెలకొంది. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. ఈ సీజప్‌లో మయాంక్, బ్రూక్, రాహుల్ అత్యంత చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. హైదరాబాద్ పరాజయాలకు వీరి వైఫల్యమే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ మార్‌క్రమ్ కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. వికెట్ కీపర్ క్లాసెన్ ఒక్కడే నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో రాజస్థాన్ వంటి బలమైన జట్టును ఓడించడం సన్‌రైజర్స్‌కు తేలికేం కాదు.
మరోవైపు రాజస్థాన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌పై గెలవాల్సిన పరిస్థితి రాయల్స్‌కు నెలకొంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శాంసన్, పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, అశ్విన్, ధ్రువ్ జురేల్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కానీ గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో శాంసన్ సేన 118 పరుగులకే కుప్పకూలింది. కానీ హైదరాబాద్ మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని రాజస్థాన్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.