Monday, November 25, 2024

ఐపిఎల్ కు భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

22 నుంచి పొట్టి క్రికెట్ సందడి

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్17 రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఐపిఎల్ తొలి దశ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి ఫేజ్‌లో మొత్తం 21 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నైతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు బరిలోకి దిగనున్నాయి. చెన్నై,చండీగఢ్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, విశాఖపట్నం, ముంబై నగరాలు ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి దశలో తమ హోంగ్రౌండ్‌గా విశాఖపట్నంను ఎంచుకుంది.

ఢిల్లీకి సంబంధించి మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరుగనున్నాయి. సన్‌రైజర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో పాటు మాజీ విజేతలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌లు బరిలోకి దిగుతున్నాయి. అంతేగాక లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా పోటీలో ఉన్నాయి. ఐపిఎల్ తొలి దశ మ్యాచ్‌లు సాఫీగా నిర్వహించేందుకు బిసిసిఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. భారీ భద్రత నడుమ మ్యాచ్‌ల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగనున్నారు. అన్ని వేదికల్లోనూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో కేవలం 21 మ్యాచ్‌లు మాత్రమే జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను బిసిసిఐ విడుదల చేయలేదు. మిగిలిన మ్యాచ్‌లు భారత్‌లో నిర్వహిస్తారా లేకుంటే విదేశాలకు తరలిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బిసిసిఐ కార్యదర్శి జైషా, ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌లు మాత్రం మిగిలిన మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరుగుతాయని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

హోరాహోరీ ఖాయం..

ఎప్పటిలాగే ఈసారి కూడా ఐపిఎల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. బరిలో ఉన్న పది జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, గుజరాత్, ఢిల్లీ జట్లు ఈసారి ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. అయితే కీలక ఆటగాళ్లు దూరం కావడంతో గుజరాత్ కాస్త బలహీనంగా మారిందనే చెప్పాలి. ప్రతి సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా సిఎస్‌కె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. కొత్త సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ముంబై బరిలోకి దిగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘ కాలం పాటు ముంబైకి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి ఈసారి హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలను అప్పగించారు.

అతని సారథ్యంలో ముంబై ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మార్‌క్రమ్ స్థానంలో కమిన్స్‌ను ఈసారి కెప్టెన్‌గా సన్‌రైజర్స్ నియమించింది. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీకి డేవిడ్ వార్నర్, లక్నోకు కెఎల్ రాహుల్‌లు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకోలేదు. బెంగళూరు టీమ్‌కు డుప్లెసిస్, చెన్నైకి ధోనీ, పంజాబ్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నారు. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈసారి ఐపిఎల్ హోరాహోరీగా సాగడం తథ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News