Sunday, December 22, 2024

మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి ఐపిఎల్
చెన్నై: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్ 2024కు శుక్రవారం తెరలేవనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు పెద్ద ఎత్తున ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ తొలి దశలో కేవలం 21 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆరంభమయ్యే ఐపిఎల్ తొలి ఫేజ్ పోటీలు ఏప్రిల్ ఏడు వరకు కొనసాగుతాయి. ఈసారి మొత్తం పది జట్లు బరిలో నిలిచాయి. ప్రస్తుత ఛాంపియన్ చెన్నైతో పాటు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐపిఎల్‌లో పోటీ పడనున్నాయి. ఎప్పటిలాగే చెన్నై, ముంబై, బెంగళూరు జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపిఎల్‌ను గెలవని బెంగళూరు ఈసారి ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. చెన్నై కూడా మరోసారి ట్రోఫీని గెలిచేందుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కూడా టైటిల్‌పై కన్నేసింది. రోహిత్ శర్మను తప్పించి ఈసారి హార్దిక్‌కు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అతని సారథ్యంలో ముంబైఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. చెన్నై, ముంబై, బెంగళూరు జట్లలో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఈసారి ఈ జట్లకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ముంబై, చెన్నైలు కొత్త కెప్టెన్ల ఆధ్వర్యంలో బరిలోకి దిగుతున్నాయి.

సీనియర్లు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్‌లను కాదని ఈసారి కొత్త వారిని ఈ జట్లు సారథులుగా నియమించాయి. ముంబైకి హార్దిక్, చెన్నైకి యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నారు. బెంగళూరు మాత్రం కిందటిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌కే మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లు కొత్త కెప్టెన్ల నేతృత్వంలో బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐడెన్ మార్‌క్రమ్ స్థానంలో కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

ఇక హార్దిక్ పాండ్య జట్టు నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ కెప్టెన్‌గా నియమించారు. ఈసారి గుజరాత్ గిల్ సారథ్యంలో పోరుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్‌కు కెఎల్ రాహుల్‌లు సారథ్యం వహించనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బాధ్యతలను తిరిగి రిషబ్ పంత్‌కు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ ఐపిఎల్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. డేవిడ్ వార్నర్ స్థానంలో పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన కెప్టెన్లు ఉండడంతో ఐపిఎల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News