ముంబై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ముంబై ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. అయితే లక్నోకు ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలు కావడం లక్నో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్లంగా మార్చింది. ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే నాకౌట్ ఛాన్స్ మెరుగ్గా ఉండేది. ఇక ముంబైతో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే లక్నోకు ఏమైనా అవకాశాలు ఉంటాయి.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో సమతూకంగానే ఉంది. అయితే నిలకడగా రాణించడంలో కీలక ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా తయారైంది. కెఎల్ రాహుల్, డికాక్, స్టోయినిస్, హుడా, పూరన్, బడోని, కృనాల్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్, డికాక్, స్టోయినిస్, హుడా, బడోని తదితరులు విఫలమయ్యారు. ఇది జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముంబైతో జరిగే కీలక మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఓపెనర్లు రాహుల్, డికాక్‌లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే జట్టు భారీ స్కోరు కష్టమేమీ కాదు. స్టోయినిస్ కూడా మెరుగ్గా ఆడక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన స్టోయినిస్ చెలరేగితే లక్నోకు ఎదురే ఉండదు. బడోని రూపంలో మరో విధ్వంసకర బ్యాటర్ ఉండనే ఉన్నాడు. అయితే దీపక్ హుడా ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగ్గా ఆడలేక పోయాడు.
వరుస అవకాశాలు లభిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా మెరుగ్గా ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది. కాగా, కిందటి మ్యాచ్‌లో పూరన్ మెరుపులు మెరిపించడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. పూరన్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. అర్షద్ ఖాన్ కూడా ఢిల్లీపై మెరుగ్గా ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న లక్నో సమష్టిగా రాణిస్తే నాకౌట్ రేసులో నిలువడం ఖాయం.
గెలుపు కోసం..
మరోవైపు ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరిచిన ముంబై కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్ పూర్తిగా విఫలమయ్యాడు. జట్టును ముందుండి నడిపించడంలో తేలిపోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మలది ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లోనైనా వీరు రాణిస్తారా లేదా అనేది సందేహమే. బౌలింగ్‌లో కూడా ముంబై అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. బుమ్రా కూడా వరుసగా విఫలమవుతున్నాడు. ఇతర బౌలర్లు కూడా నిరాశ పరుస్తున్నారు. ఇలాంటి స్థితిలో లక్నోతో జరిగే మ్యాచ్‌లో ముంబై ఎలా ఆడుతుందో చెప్పలేం.