ఐపిఎల్ సీజన్17లో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈడెన్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌లో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. కొన్ని సీజన్‌లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న సన్‌రైజర్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ బరిలో దిగుతోంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కమిన్స్ సన్‌రైజర్స్‌ను ఎలా నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా భారీ ఆశలతో టోర్నమెంట్‌లో బరిలో దిగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ వేటను ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతాలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్,
వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, నితీష్ రాణా, మిఛెల్ మార్ష్, మనీష్ పాండే, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. గతంతో పోల్చితే ఈసారి సన్‌రైజర్స్ కాస్త బలంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్, మార్కొ జాన్సన్ వంటి స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ కమిన్స్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఆరంభ మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉండడంతో హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఈ సీజన్ ద్వారా మళ్లీ పూర్వవైభవం సొంతం చేసుకోవాలనే లక్షంతో సన్‌రైజర్స్ పావులు కదుపుతోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.
అందరి కళ్లూ కమిన్స్‌పైనే..
ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మినీ వేలం పాటలో కళ్లు చెదిరే ధరను చెల్లించి కమిన్స్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ యాజమాన్యం ఊహించినట్టే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. కమిన్స్ కూడా తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు సిద్ధమయ్యాడు. బంతితో పాటు విధ్వంసక బ్యాటింగ్‌కు కమిన్స్ పెట్టింది పేరు. అతను తన మార్క్ ఆటతో చెలరేగితే ప్రత్యర్థి జట్లకు కష్టాలు ఖాయం. కమిన్స్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, ఫిలిప్స్, మయాంక్ తదితరులు జట్టుకు కీలకంగా మారారు. వీరంతా తమవంతు పాత్ర పోషిస్తే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం సన్‌రైజర్స్‌కు కష్టమేమీ కాదనే చెప్పాలి.