Sunday, January 19, 2025

నేడు రాజస్థాన్‌తో పోరు.. ముంబైకి చాలా కీలకం

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబై కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు కీలకంగా మారింది. రాజస్థాన్ వరుస విజయాలతో ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ముంబై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్‌పై చెమటోడ్చి విజయం సాధించింది.

ఇలాంటి స్థితిలో బలమైన రాజస్థాన్‌తో పోరు ముంబైకి సవాల్‌గా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయితే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఫామ్‌లో ఉండడం ముంబైకి కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. రోహిత్ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇషాన్ కిషన్ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా జోరుమీదున్నాడు. టిమ్ డేవిడ్, షెఫర్డ్, నబి, తిలక్‌వర్మలతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బుమ్రా బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కొయెట్జి, శ్రేయస్ గోపాల్, నబి కూడా పర్వాలేదనిపిస్తున్నారు.

కాగా, సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ముంబైకి అసాధ్యమేమీ కాదు. మరోవైపు రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌కు కూడా సమరోత్సాహంతో సిద్ధమైంది. సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రొమన్ పొవెల్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక బౌల్ట్, అశ్విన్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు కూడా జట్టులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News