అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్లో అసాధారణ ఆటతో అదరగొడుతున్న కోల్‌కతా నాకౌట్ దశలో చెలరేగి పోయింది. హైదరాబాద్‌పై ఏకపక్ష విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్‌కు మరో ఛాన్స్ ఉంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో హైదరాబాద్ క్వాలిఫయర్2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఆదివారం జరిగే తుదిపోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొంటోంది.
ఇక తొలి క్వాలిఫయర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3) విఫలమయ్యారు. నితీష్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0) కూడా నిరాశ పరిచారు. అయితే రాహుల్ త్రిపాఠి (55), హెన్రిచ్ క్లాసెన్ (32) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. చివర్లో కెప్టెన్ కమిన్స్ (30) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇక ప్రత్యర్థి జట్టు బౌలర్లలో స్టార్క్ మూడు, చక్రవర్తి రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (23), నరైన్ (21) ధాటిగా ఆడారు. ఇక వెంకటేష్ అయ్యర్ 51 (నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 58 (నాటౌట్) జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.