మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. వారం రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. ఇక గుజరాత్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఆ జట్టుకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అయితే హైదరాబాద్‌కు మాత్రం కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇక గుజరాత్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలువాలనే లక్షంతో ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. కానీ కోల్‌కతా జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడం గుజరాత్ ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే గుజరాత్ నాకౌట్ ఛాన్స్ సజీవంగా ఉండేది. కానీ వర్షం గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే హైదరాబాద్ వంటి బలమైన జట్టుపై గెలవడం ద్వారా కాస్తయిన ఊరట పొందాలనే భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలమైంది. దీంతో వరుస ఓటములు తప్పలేదు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం ఐదింటిలో మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ వంటి స్టార్లు గుజరాత్‌లో ఉన్నారు. అయితే ఈ సీజన్‌లో వీరంత ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఒక మ్యాచ్‌లో చెలరేగి ఆడితే తర్వాతి పోరులో విఫలమయ్యారు. ఇలా స్టార్ ఆటగాళ్లలో నిలకడ లోపించడం గుజరాత్‌కు ప్రతికూలంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతోంది. ఇది జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పాలి. కానీ సొంత గడ్డపై ఆడుతున్న సన్‌రైజర్స్‌ను ఓడించాలంటే గుజరాత్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు ఉంటాయి.
ఆ ఇద్దరే కీలకం..
మరోవైపు ఆతిథ్య సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ సాధించిన విజయాల్లో వీరిద్దరి చాలా కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మ్యాచ్‌లో కూడా ఇద్దరు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, కెప్టెన్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. వీళ్లలో ఏ ఇద్దరు రాణించినా సన్‌రైజర్స్‌కు ఎదురే ఉండదు. ఇక భువనేశ్వర్, ఉనద్కట్, నటరాజన్, కమిన్స్, షాబాజ్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది.