Sunday, January 19, 2025

IPL 2024: నేడు ఉప్పల్‌లో పంజాబ్‌తో సన్‌రైజర్స్ పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 17లో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో రానున్న నాకౌట్ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఇక ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం పొంచి ఉంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ జరిగే జోరు కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.

అయితే మ్యాచ్ జరిగితే మాత్రం విజయం సాధించాలనే లక్షంతో హైదరాబాద్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌ను నాకౌట్‌కు చేర్చడంలో వీరి పాత్ర చాలా కీలకమని చెప్పాలి. పంజాబ్‌తో పోరులో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్‌క్రమ్, సమద్, షాబాజ్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. క్లాసెన్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

పంజాబ్‌తో పోరులో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. నితీష్ రెడ్డి, మార్‌క్రమ్, సమద్‌లు కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో కూడా హైదరాబాద్ సమతూకంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది.కమిన్స్, ఉనద్కట్, నటరాజన్, షాబాజ్‌లతో బౌలింగ్ బలంగా ఉంది. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని భావిస్తోంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో గెలవడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సన్‌రైజర్స్‌పై గెలిచి టోర్నీని ముగించాలని భావిస్తోంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, బెయిర్‌స్టో, రొసొ, శశాంక్ సింగ్, అశుతోష్, కెప్టెన్ సామ్ కరన్, జితేష్ శర్మ తదితరులతో పంజాబ్ బలంగా ఉంది. అర్ష్‌దీప్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్, రాహుల్ చాహర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News