మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ లీగ్‌గా పేరున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 18కి శనివారం తెరలేవనుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరిగే ఈ టోర్నమెంట్ అభిమానులకు కనువిందు చేయనుంది. పది జట్లు ఈ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నమెంట్ ఆరంభమవుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
కాగా, ఈసారి ఐపిఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. బాలీవుడ్ స్టార్‌లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఐపిఎల్ పాలక మండలి, భారత క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాయి. సుదీర్ఘ కాలం పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను ఎలాంటి లోటు లేకుండా జరిపేందుకు బిసిసిఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. మొత్తం పది జట్లు ఐపిఎల్ బరిలో నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, మాజీ ఛాంపియన్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క ఐపిఎల్ టైటిల్‌ను కూడా సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాయి.
అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌కు బెంగళూరు టీమ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో ఛాలెంజర్స్ ఈసారి బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ కాలంగా అందరి ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను ఈ సీజన్‌లో ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై కూడా ఇదే లక్షంతో పోరుకు సిద్ధమైంది. హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబైను టోర్నమెంట్ ఫేవరెట్ జట్లలోఒకటిగా పరిగణిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా టైటిల్‌పై కన్నేసింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నైలో మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కిందటి రన్నరప్ హైదరాబాద్ కూడా ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కమిన్స్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. దీంతో సన్‌రైజర్స్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.
హోరాహోరీ ఖాయం..
ఈసారి ఐపిఎల్‌లో అన్ని జట్లు భారీ ఆశలతో పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, షమి, సిరాజ్, శ్రేయస్, సంజు శాంసన్, ధోనీ, రచిన్ రవీంద్ర, జోస్ బట్లర్, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రహానె తదితరులు ఈ టోర్నమెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. తమ తమ జట్లను ముందుండి నడిపించేందుకు వీరు సిద్ధమయ్యారు. కాగా, గతంతో పోల్చితే ఈసారి ఐపిఎల్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.