Thursday, February 20, 2025

హైదరాబాద్‌లో 9 మ్యాచ్‌లు

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్18కి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీంతో పాటు క్వాలిఫయర్ వన్, టుతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏకంగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఏడు లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు నాకౌట్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 23న ఉప్పల్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక మార్చి 27న లక్నోతో హైదరాబాద్ పోరు జరుగుతుంది.

ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ ఆడుతుంది. ఇక ఏప్రిల్ 12న ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ పోటీ పడుతుంది. ఇక బలమైన ముంబై ఇండియన్స్‌తో పోరు ఏప్రిల్ 23న జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 5న జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఇక పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మే 10న ఆడుతుంది. ఇలా లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లను హోం గ్రౌండ్ హైదరాబాద్‌లో ఆడుతుంది. దీంతో పాటు ప్లేఆఫ్‌లో జరిగే రెండు మ్యాచ్‌లకు కూడా ఉప్పల్ వేదకగా నిలువనుంది. మే 20న ఉప్పల్‌లో క్వాలిఫయర్1 పోరు జరుగనుంది. అంతేగాక ఎలిమినేటర్ మ్యాచ్‌కు కూడా హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్ మే 21న ఉప్పల్‌లో నిర్వహిస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలో కూడా ఐపిఎల్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తన హోం గ్రౌండ్‌లలో విశాఖపట్నం స్టేడియాన్ని కూడా ఎంచుకుంది. మార్చి 24న ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను విశాఖలో ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ తలపడుతుంది. ఇక మార్చి 30న విశాఖలో హైదరాబాద్‌ను ఎదుర్కొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లను కలుపుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 11 ఐపిఎల్ జరుగనుండడం విశేషం. కాగా, హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు అభిమానుల నుంచి అనూహ్యం లభించడం అనవాయితీగా వస్తోంది. మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ ప్రేమీకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రతి సీజన్‌లో ఐపిఎల్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో 9 మ్యాచ్‌లు జరుగుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా ఐపిఎల్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదల కావడంతో త్వరలోనే ఏర్పాట్లు ప్రారంభించాలని హెచ్‌సిఎ అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మెగా టోర్నమెంట్‌ను నిర్వహించాలనే లక్షంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News