ఐపిఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు మరో అరుదైన రికార్డు సృష్టించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్య విజయం సాధించింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను కేవలం 95 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 16 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. అయితే, ఐపిఎల్ లో ఇంత తక్కువ స్కోరు(111) చేసినా గెలుపొందిన తొలి జట్టుగా పంజాబ్ అరుదైన ఘనత సాధించింది. కాగా, గతేడాది కోల్ కతాపై 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది. దీంతో ఒకే జట్టుపై అత్యధిక స్కోరును ఛేదించి.. అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా పంజాబ్ నయా రికార్డు నెలకొల్పింది.
కాగా, నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను పంజాబ్ బౌలర్లు 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి జట్టుకు అద్భుత విజయం సాధించి పెట్టారు. ఓపెనర్లు డికాక్ (2), సునీల్ నరైన్ (5)లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. కెప్టెన్ అజింక్య రహానె (17) కూడా నిరాశ పరిచాడు. అంగరిష్ రఘువంశీ (37) ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. వెంకటేశ్ అయ్యర్ (7), రింకూ సింగ్ (2) విఫలమయ్యారు. రమణ్‌దీప్ సింగ్ (0), వైభవ్ అరోరా (0), హర్షిత్ రాణా (3) కూడా తేలిపోయారు. రసెల్ (17) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు, జాన్సన్ మూడు వికెట్లు తీశారు.