Wednesday, January 22, 2025

రెండు రోజుల పాటు ఐపిఎల్ వేలం పాట

- Advertisement -
- Advertisement -

IPL auction for two days

రెండు రోజుల పాటు ఐపిఎల్ వేలం పాట
అందరి కళ్లు వార్నర్, అయ్యర్‌పైనే
తొలి రోజు అదృష్టానికి పరీక్షించుకోనున్న 161 మంది క్రికెటర్లు

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలానికి శనివారం తెరలేవనుంది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు క్రికెటర్ల వేలం పాట జరుగనుంది. ఈసారి పది జట్లు వేలం పాటలో పాల్గొంటున్నాయి. పాతగా ఉన్న 8 జట్లతో పాటు ఈసారి కొత్త రెండు ఫ్రాంచైజీలు జత కలిశాయి. శని, ఆదివారాల్లో బెంగళూరులో జరిగే వేలం పాటలో పది ఫ్రాంచైజీలు క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి. ఈసారి వేలంలో 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో భారత్‌తో పాటు ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు ఉన్నారు. కాగా శనివారం తొలి రోజు జరిగే మెగా వేలం పాటలో 161 మంది క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. వీరిలో భారత్‌కు చెందిన శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు. అంతేగాక ఆస్ట్రేలియా స్టార్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తదితరులు కూడా తొలి రోజు వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారారు.

అంతేగాక క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, ట్రెంట్ బౌల్ట్, కగిసొ రబాడ కూడా తమ మెగా వేలం బరిలో దిగనున్నారు. ఈసారి ఐపిఎల్‌కు చెందిన పది ఫ్రాంచైజీలు కూడా స్టార్ క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ విజేతలు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌లతో పాటు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతున్నాయి. అంతేగాక కొత్త ఫ్రాంచైజీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా మెగా వేలం పాటలో పాల్గొంటున్నాయి. మొదటి రోజు 161 క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మెగా వేలం పాట ఆరంభం కానుంది. నగరంలోని ఐటిసి గార్డెనియాలో ఈ వేలం పాట జరుగనుంది.

చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న మెగా వేలం పాటపై అందరి దృష్టి నిలిచింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈసారి వేలం పాటలో పది ఫ్రాంచైజీలు కనీసం రూ.500 కోట్లకు పైగా వెచ్చించనున్నాయి. కాగా ఐపిఎల్ మెగా వేలం పాటలో మొత్తం 48 మంది క్రికెటర్లు రూ. 2 కోట్ల కనీస ధర కలిగి ఉన్నారు. వీరిలో 17 మంది భారత్‌కు చెందిన స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇదిలావుండగా ఇషాన్ కిషన్, శార్దూల్, శ్రేయస్, దీపక్ చాహర్, షమి, అశ్విన్, ధావన్, హర్షల్ పటేల్, పడిక్కల్, యజువేంద్ర చాహల్ తదితరులను సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీ అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News