Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం, సరూర్‌నగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వారి వద్ద నుంచి రూ.3,50,000 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….వనస్థలిపురానికి చెందిన నేలపాల నరేష్ యాదవ్, అవనగంటి అంజయ్య, సచిన్ దిలీప్ దాలియా కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నరేష్ యాదవ్, అంజయ్య స్నేహితులు ఇద్దరు కలిసి ప్రధాన బూకీ సచిన్ దిలీప్ ద్వారా వాట్సాప్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనే వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌లను ఇస్తున్నారు. యాప్ ద్వారా నిందితులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, హైదరాబాద్, షాహినాయత్‌గంజ్‌కు చెందిన శైలేందర్ అగర్వాల్, ఉగ్గి శ్రీధర్, కానుకు గణేష్ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. శైలేందర్ ప్రధాన బూకీగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శైలేందర్ ఐపిఎల్ క్రికెట్‌లో బెట్టింగ్ నిర్వహించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. కెకెఆర్, ఆర్‌ఆర్ టీంల మ్యాచ్‌లో పంటర్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించాడు. వాట్సాప్ ద్వారా బెట్టింగ్‌లో పాల్గొనే వారిని సంప్రదిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News