మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఈసారి ఐపిఎల్‌లో పది జట్లు బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈసారి ఐపిఎల్‌లో లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 31న ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌లు మే 21న ముగుస్తాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుంటే ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రస్తుత ఛాంపియన్ గుజరాత్‌తో పాటు మాజీ విజేతలు చెన్నై, సన్‌రైజర్స్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోఫీని సాధించని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లు ఈసారి ఎలాగైనా ట్రోఫీనీ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్, మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. దాదాపు అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ప్రతి టీమ్‌లోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్, సంజు శాంసన్, మహేంద్ర సింగ్ ధోనీ, డెవోన్ కాన్వే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మోయిన్ అలీ, రషీద్ ఖాన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, శుభ్‌మన్ గిల్, డికాక్, నితీష్ రాణా తదితరులు ఈసారి ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. టోర్నీలో పాల్గొంటున్న ప్రతి జట్టులో భారత్‌తో పాటు విదేశీ జట్లకు చెందిన స్టార్ క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.
హోరాహోరీ ఖాయం..
గతంలోలాగే ఈసారి కూడా ఐపిఎల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి గుజరాత్, సన్‌రైజర్స్, చెన్నై, ముంబై, బెంగళూరు జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. ధోనీ లాంటి అపార అనుభవజ్ఞుడైన సారథి ఉండడం చెన్నైకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కూడా చాలా బలంగా ఉంది. కొత్త సారథి మార్‌క్రామ్ సారథ్యంలో సన్‌రైజర్స్ కూడా సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది. ఇక తొలి సీజన్‌లోనే అసాధారణ కెప్టెన్సీతో గుజరాత్‌కు ట్రోఫీని సాధించి పెట్టిన హార్దిక్ పాండ్య కూడా మరో ట్రోఫీపై కన్నేశాడు. కోల్‌కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, ఢిల్లీ జట్లను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.
భారీ ఏర్పాట్లు..
మరోవైపు ఐపిఎల్ కోసం ఈసారి భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి టోర్నమెంట్‌ను సాఫీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈసారి ఐపిఎల్ 12 వేదికల్లో జరుగనుంది. అహ్మదాబాద్, మొహాలీ, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, గౌహతి, ధర్మశాల, లక్నో, జైపూర్, ముంబై నగరాల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగే అశకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఈసారి ఐపిఎల్‌లో కొత్త నిబంధనలు చోటు చేసుకున్నాయి. ఈ నిబంధనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.