Thursday, November 14, 2024

ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో లేనట్టే?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్‌లో నిర్వహించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే తొలి ఫేజ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. 15 రోజుల పాటు తొలి దశ పోటీలు భారత్‌లో జరుగనున్నాయి. మార్చి 22న తొలి ఫేజ్ పోటీలకు తెరలేవనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించనున్నారు. అయితే శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో..ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా మారింది. సుదీర్ఘ రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో రెండో దశ పోటీలను దుబాయి వేదికగా నిర్వహించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

మరోవైపు ఆయా ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల పాస్‌పోర్టులను తీసుకుంటున్నాయనే వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఐపిఎల్ రెండో దశ వేదికగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్రాంచైజీల యాజమాన్యాలు కూడా దుబాయి వేదికగా మిగిలిన పోటీలను నిర్వహించాలని బిసిసిఐ కోరుతున్నట్టు సమాచారం. దుబాయిలో ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇప్పటికే బిసిసిఐ పావులు కదుపుతున్నట్టు తెలిసింది. దీని కోసం ఇప్పటికే ఐపిఎల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి.

కానీ, దీనిపై ఇప్పటి వరకు బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన జారీ కాలేదు. ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాత్రం రెండో దశ పోటీలు కూడా భారత్‌లోనే జరుగుతాయని గతంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని వివరించారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో బిసిసిఐ ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఐపిఎల్ మ్యాచ్‌లను దుబాయికి మార్చడం తథ్యంగా కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్‌కు భద్రత కల్పించడం కష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేదికను వేరే చోటికి మార్చే అవకాశాలున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News