Thursday, January 23, 2025

ముగిసిన ఐపిఎల్ మీడియా హక్కుల వేలం

- Advertisement -
- Advertisement -

డిస్నీ స్టార్‌కు టీవీ హక్కులు, వయాకామ్‌కు డిజిటల్స్ రైట్స్
బిసిసిఐకి రూ.48,390 కోట్ల ఆదాయం

ముంబై: ఆసక్తికరంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కుల వేలం పాట మంగళవారం ముగిసింది. ఈ వేలం పాట ద్వారా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కి రూ.48,390 కోట్ల ఆదాయం లభించనుంది. ఇదే సమయంలో ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్ ఐపిఎల్ నిలిచింది. మూడు రోజుల పాట కొనసాగిన ఈ వేలం పాటకు తెరపడింది. ఇక ఈసారి కూడా టివి ప్రసార హక్కులను డిస్నీ స్టార్ (స్టార్ నెట్‌వర్క్) సొంతం చేసుకుంది. సోమవారం రెండో రోజు వేలం పాట ముగిసే సమయానికి సోనీ నెట్‌వర్క్ ముందంజలో నిలిచింది. అయితే మంగళవారం చివరి రోజు అనూహ్యంగా స్టార్ నెట్‌వర్క్ టివి ప్రసార హక్కులను దక్కించుకుంది. 202327 కాలానికి గాను టివి రైట్స్ కోసం స్టార్ నెట్‌వర్క్ భారత క్రికెట్ బోర్డుకు రికార్డు స్థాయిలో రూ.23,575 కోట్ల చెల్లించనుంది.

గతంలో కూడా స్టార్ నెట్ వర్క్‌కే ఐపిఎల్ టివి ప్రసార హక్కులు దక్కిన విషయం విదితమే. ఇక డిజిటిల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్18 సొంతం చేసుకుంది. రానున్న ఐదేళ్ల వ్యవధి కోసం వయాకామ్ సంస్థ రూ.20,500 కోట్లను బిసిసిఐకి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు విదేశాల్లో ప్రసారాలకు సంబంధించిన మీడియా హక్కులను రిలయన్స్ వయాకామ్‌టైమ్స్ ఇంటర్నెట్‌లు సంయుక్తంగా దక్కించుకున్నాయి. దీని కోసం రెండు సంస్థలు కలిసి బిసిసిఐకి రూ.3,273 కోట్లు చెల్లించనున్నాయి. ఇక ఐపిఎల్ మీడియా రైట్స్‌కు సంబంధించిన వివరాలను భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా మీడియాకు వెల్లడించారు.

బిసిసిఐపై నమ్మకం నుంచి వేలాది కోట్ల రూపాయలను చెల్లించేందుకు ముందుకు వచ్చిన స్టార్ నెట్‌వర్క్, రిలయన్స్ వయాకామ్, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలను ఆయన అభినందించారు. దీనికి సహకరించిన ఆయా సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రపంచంలోనే ఐపిఎల్ లీగ్‌కు ఎంతో ఆదరణ ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరగడం ఖాయమన్నారు. తమతో జతకట్టిన ప్రతి సంస్థకు బిసిసిఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారికి ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా చూసుకుంటామని జైషా హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News