Wednesday, January 22, 2025

అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే… ఈసారి జాక్‌పాట్ కొట్టేదెవరో..?

- Advertisement -
- Advertisement -

ఈసారి జాక్‌పాట్ కొట్టేదెవరో?
అందరి కళ్లు స్టోక్స్, శామ్ కరన్‌పైనే
నేడు కొచ్చిలో ఐపిఎల్ మినీ వేలం పాట
కొచ్చి: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం శుక్రవారం మినీ వేలం పాట నిర్వహించనున్నారు. కేరళలోని కొచ్చి వేదికగా ఈ వేలం పాట జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేలం పాట ఒక్క రోజులోనే ముగియనుంది. ఈసారి వేలం పాట కోసం 991 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 405 మంది ఆటగాళ్లకు షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కింది. ఈసారి జరిగే వేలం పాటలో భారత్‌కు చెందిన 273 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అంతేగాక 132 విదేశీ క్రికెటర్లు వేలం పాటలో పాల్గొననున్నారు. బరిలో ఉన్న క్రికెటర్ల నుంచి 87 మందిని ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి. వీరిలో 30 మంది విదేశీ, 57 మంది భారత క్రికెటర్లు ఉండనున్నారు. కాగా, షార్ట్ లిస్ట్ చేసిన క్రికెటర్లను ఐదు సెట్లుగా విభజించారు. తొలి సెట్‌లో బ్యాటర్లు, రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్‌లో వికెట్ కీపర్లకు చోటు లభించింది. ఇక నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లకు స్థానం కల్పించారు.

ఆ ఇద్దరి కోసం తీవ్ర పోటీ
ఈసారి వేలం పాటలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, శామ్ కరన్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరిని సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడనున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండడంతో స్టోక్స్, కరన్‌ల కోసం గట్టిగా ప్రయత్నించనుంది. మరోవైపు మయాంగ్ అగర్వాల్, జో రూట్, జేసన్ హోల్డర్, రొసొ, రహానె, జగదీశన్ తదితరుల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి.

సన్‌రైజర్స్ వద్ద రూ.42.25 కోట్లు
ఈసారి మినీ వేలంలో పాల్గొంటున్న 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.206.5 కోట్ల పర్స్‌మనీ ఉంది. ఈ డబ్బులతోనే ఆయా జట్లు క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి. వీటిలో హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ వద్ద అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉన్నాయి. దీంతో వేలంలో అందుబాటులో ఉండే కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసే ఛాన్స్ సన్‌రైజర్స్‌కే అధికంగా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ వద్ద రూ.32.2 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.20.55 కోట్లు, సిఎస్‌కె వద్ద రూ.20.45 కోట్లు, లక్నో వద్ద రూ.23.35 కోట్లు ఉన్నాయి. ఇక అత్యల్పంగా కోల్‌కతా వద్ద రూ.7.05 కోట్లు మాత్రమే ఉండగా బెంగళూరు వద్ద రూ. 8.75 కోట్లు ఉన్నాయి. కాగా, క్రికెటర్ల వేలం పాటను స్టార్ స్పోర్ట్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News