దుబాయిలో వెల్లడించే అవకాశం
నూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపిఎల్) వచ్చే సీజన్‌లో బరిలోకి దిగే రెండు కొత్త జట్లను సోమవారం దుబాయిలో వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ టీమ్‌ల కోసం బిసిసిఐ అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల, ఇండోర్, కటక్, గౌహతి నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని దక్కినంచుకునేందుకు గట్టి పోటీయే నెలకొంది. ఒక్కో కంపెనీ రూ.2000 కోట్ల కనీస ధరతో బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో అధిక వాటా కలిగిన లాన్సర్ క్యాపిటల్ సంస్థ కూడా కొత్త జట్టు కోసం పోటీ పడుతోంది. అలాగే అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్, అరబిందో ఫార్మా, టొరంట్ ఫార్మా,హిందుస్థాన్ టైమ్‌స గ్రూపులాంటి దిగ్గజ కంపెనీలు కూడా పోటీలో ఉన్నాయి. ఒక్కో టీమ్‌కు రూ.8,00010,000 కోట్ల దాకా రాబడి వస్తుందని బిసిసిఐ ఆశతో ఉంది. కాగా బిడ్స్‌ను సాంకేతికంగా పరిశీలించిన తర్వాత సోమవారం టీమ్‌లను గెలుచుకున్న వారి పేర్లను సోమవారం ప్రకటించాలా లేదా అనేది నిర్ణయిస్తామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి బిడ్స్ ఈ నెల 17నే తెరవాల్సి ఉండింది. అయితే టెండర్ డాక్యుమెంట్ల కొనుగోలుకు గడువును ఈ నెల 20 దాకా పొడిగించడంతో టీంలను గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించడం ఆలస్యమైంది.