ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఐపిఎల్ ఫ్రాంచైజీలు
సుదీర్ఘ పర్యటన నుంచి విశ్రాంతి కోసమేనని వెల్లడి
న్యూఢిల్లీ: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆ సక్తికరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ జరగకుండానే పూర్తయింది. దీంతో అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ఇరు జట్ల ఆటగాళ్లు ఐపిఎల్ కోసం దుబాయ్‌కు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలోనే మే 4న నిరవధికంగా వాయిదా పడిన టీ20 లీగ్.. ఈ 19 నుంచి తిరిగి యూఎఇలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తమ ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐదో టెస్టు రద్దవ్వడం వల్ల సుదీర్ఘ పర్యటన నుంచి ఆటగాళ్లకు కాస్త ఉపశమనం లభిస్తుందని, అందుకే వారిని త్వరగా తీసుకొస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముంబయి, బెంగళూరు ప్రత్యేక విమానాలు
ఈ ఐపిఎల్ సీజన్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్, పేస్‌గుర్రం జస్ప్రిత్ బుమ్రా తమ కుటుంబాలతో సహా ఇంగ్లాండ్‌కు వెళ్లారు. దీంతో వారందరినీ శనివారం ప్రత్యేకంగా చార్టర్ ఫ్లైట్‌లో మాంచెస్టర్ నుంచి దుబాయ్‌కు తీసుకొచ్చింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీరు శనివారం రాత్రి నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం యూఏఈకి చేరుకోనున్నారు.
కమర్షియల్ బాటలో చెన్నై, పంజాబ్..
మరోవైపు ఆర్‌సిబి, ముంబయి ఇండియన్స్ తర్వాత ఇక మాంచెస్టర్‌లో మిగిలింది చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లే. అయితే, ఈ రెండు జట్లూ తమ క్రికెటర్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు క మర్షియల్ బాటపట్టాయి. రవీంద్ర జడేజా, చెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, మొయిన్ అలీ, సామ్‌కరన్ ఈ ఐదుగురిని కమర్షియల్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఎస్‌కె సిఇఒ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం తమ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్, మహ్మద్ షమీ, డేవిడ్ మలన్‌ను కమర్షియల్ విమానంలోనే తరలించేందుకు సిద్ధమైనట్లు ఆ జట్టు సిఇఒ సతీశ్ మీనన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ నాలుగు జట్లలోని మిగతా ఆటగాళ్లంతా యూఎఇకి చేరుకున్నారు. అక్కడ క్వారంటైన్ గడువు పూర్తిచేసుకున్న వారు ప్రాక్టీస్ చేస్తుండగా, మిగతా వారు హోటల్ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఇంగ్లాండ్ పర్యటన నుంచి దుబాయ్‌కు చేరుకునే ఇరు జట్ల క్రికెటర్లు కచ్చితంగా ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంటారని చెప్పారు.
IPL Players Fly out from England to UAE