ఈ ఐపిఎల్ సీజన్ లో కొన్ని మార్పులు చేసిన బిసిసిఐ
టాస్ ను బట్టి టీమ్‌ను ఎంపిక చేసుకునే వీలు
ఫీల్డింగ్, బౌలింగ్ టైమ్ విషయంలోనూ కొత్త నిబంధనలు
ముంబై: మరో వారం రోజుల్లో ఐపిఎల్ క్రికెట్ మొదలుకాబోతోంది. ఈనెల 31 నుంచి ఐపిఎల్ మెగా టోర్నీ సందడి చేయబోతోంది. అయితే ఈ సారి బిసిసిఐ స్వల్ప మార్పులు చేసింది. టాస్ తర్వాత కూడా తుది జట్టును మార్చుకునే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఇప్పటిదాకా 11 మంది జట్టు సభ్యులను టాస్‌కు ముందే ప్రకటించాల్సి ఉండేది. అయితే తాజాగా ఈ రూల్‌ను బిసిసిఐ మార్చేసింది. టాస్ తర్వాత రిఫరీకి సమర్పించే 11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల లిస్ట్ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. అంతకుముందే జట్టును ప్రకటించినా సరే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టాస్ గెలిస్తే ఒక టీమ్‌ను, ఓడితే మరో టీమ్‌ను ఎంచుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కొత్త రూల్‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఐపీఎల్ నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి.