Saturday, November 16, 2024

సెప్టెంబర్‌లో ‘సెకండాఫ్’?

- Advertisement -
- Advertisement -

IPL second half in September?

 

యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!

ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. యూఎఈ వేదికగా ఐపిఎల్ సెకండాఫ్‌ను నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే భారత క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో భారత్ వేదికగా నిర్వహించిన ఐపిఎల్‌ను మధ్యలోనే నిలిపి వేశారు. కొవిడ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఐపిఎల్‌ను అర్ధాంతరంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక ఐపిఎల్‌లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లను యూఎఈలో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఓ జాతీయ చానెల్‌లో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించి ఐపిఎల్‌ను పూర్తి చేసే ఉద్దేశంతో బిసిసిఐ ఉన్నట్టు తెలిసింది.

దీని కోసం ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో బిసిసిఐ అధికారులు చర్చలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపిఎల్ రెండో దశ జరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 29న జరిగే బిసిసిఐ ప్రత్యేక సమావేశంలో ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అవసరమైతే ఐపిఎల్ కోసం ఇంగ్లండ్ సిరీస్‌ను కాస్త ముందుకు జరిపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసిబి)తో బిసిసిఐ అధికారులు చర్చలు జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి.

బీజీ అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపిఎల్‌ను నెలరోజుల్లోనే ముగించాలని బిసిసిఐ భావిస్తోంది. వీకెండ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా ఐపిఎల్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఐపిఎల్ రెండో దశను యూఎఈ వేదికగా నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది. కిందటి ఐపిఎల్ సీజన్‌ను కూడా ఇక్కడే నిర్వహించిన విషయం విదితమే. ఈసారి కూడా అక్కడే ఐపిఎల్ నిర్వహించడానికి బిసిసిఐ ఆసక్తి చూపిస్తోంది. ఇక పలువురు విదేశీ క్రికెటర్లు కూడా యూఎఈలోనే టోర్నీ జరిగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక త్వరలోనే ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించి ఐపిఎల్‌పై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించాలని బిసిసిఐ భావిస్తోంది.

ప్రపంచకప్ కూడా..

మరోవైపు ఐపిఎల్ సక్సెస్ అయితే ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్‌ను కూడా యూఎఈలోనే నిర్వహించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత్‌లో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యూఎఈలోనే వరల్డ్‌కప్ నిర్వహించడం సబబుగా ఉంటుందనే అభిప్రాయంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు. కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారత్‌పై ప్రయాణ ఆంక్షలు విధించాయి. అంతేగాక వరల్డ్‌కప్ కొంత సమయం మాత్రమే మిగిలివుండడంతో దీన్ని యూఎఈలోనే నిర్వహిస్తే బాగుంటుందని బిసిసిఐ భావిస్తోంది. ఇక టోర్నీ నిర్వహణ కోసం ఇప్పటికే యూఎఈ బోర్డుతో చర్చలను కూడా ప్రారంభించింది. త్వరలోనే ఇవి కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News