Wednesday, January 22, 2025

పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్‌జరిపిన దాడులలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. చాలా సేపటివరకూ ఈ దాడుల గురించి పాక్ నిఘా సంస్థలు, సైనిక వర్గాలు పసికట్టలేకపొయ్యాయి. దాడుల విషయం నిర్థారణ కాగానే ఇరాన్‌ను పాకిస్థాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ముందస్తు సమాచారం లేకుండా ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడటం తీవ్ర పరిణామం అని, దీని పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే సున్నీ మిలిటెంట్ గ్రూప్ అయిన జైష్ అల్ అదిల్ పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉందని, వీటి నిర్మూలనకు ఈ దాడులు సాగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఆ తరువాత తెలిపింది.

ఉగ్రవాద స్థావరాలను ఎక్కడున్నా ధ్వంసం చేయాల్సిందేనని పేర్కొంటూ ఇరాన్ ఈ దాడులను సమర్ధించుకుంది. గతంలో ఈ సంస్థ తమ సైన్యానికి నష్టం కల్గించిందని,ఇది తమ ప్రతీకార చర్య అని ఇరాన్ అధికారికంగా తెలిపింది. రెం డు స్థావరాలను ఇరాన్ సేనలు ధ్వంసం చేశాయని కూడా నిర్థారించారు. ఈ ఘటన తరువాత ఉన్నట్లుండి ఇరాన్ పాకిస్థాన్ నడుమ దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముందుగా పాకిస్థాన్‌లోని ఇరాన్ దౌత్య ప్రతినిధిని అధికారులు పిలిపించి మాట్లాడారు. కొద్ది సేపటి తరువాత తమ దేశంలోని ఇరాన్ రాయబారిని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయానికి పిలిపించి , దేశం తరఫున ఆక్షేపణ తెలిపారు. ఇరాక్, సిరియాల్లోని మిలిటెంట్ల స్థావరాలపై ఒక్కరోజు క్రితమే ఇరాన్‌కు చెందిన సుశిక్షిత రెవెల్యూషనరీ గార్డు దళాలు దాడి జరిపాయి. వెనువెంటనే పాకిస్థాన్‌లోని టెర్రర్ స్థావరాలను లక్షంగా చేసుకుని నేల మట్టం చేశాయి. దీనితో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి.

గాజాస్ట్రిప్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ఎర్రసముద్రంలో దీని ప్రభావంతో పరిస్థితి విషమించిన దశలోనే ఈ ఘటన జరిగింది. జయిష్ అల్ ధుల్మ్ లేదా జైష్ అల్ అదల్ అనే పేరిట ఉన్న సంస్థకు చెందిన రెండు శిబిరాలను ఎంచుకుని దాడి జరిపి ధ్వంసం చేసిన విషయాన్ని ఇరాన్‌కు చెందిన పాక్షిక అధికారిక వార్తాసంస్థ సనీమ్ వార్తా సంస్థతెలిపింది. గ్రీన్ మౌంటెన్ ప్రాంతంలోని స్థావరాలను నేలమట్టం చేశారని వివరించారు. చాలా రోజులుగా ఈ సంస్థ కార్యకలాపాల గురించి ఇరాన్ పాకిస్థాన్‌కు హెచ్చరికలు వెలువరిస్తోంది. బలూచిస్థాన్‌లోని సరిహద్దు పట్టణం పంజ్గౌర్ సమీపంలోని పాకిస్థాన్ భూభాగంలో ఈ ఉగ్రవాద సంస్థ స్థావరాలు ఉన్నాయని, ఇరాన్ సేనలపై దాడులకు ఇక్కడి నుంచి వ్యూహరచన సాగుతోందని తెలియడంతో దాడులకు దిగినట్లు ఇరాన్ ప్రకటించింది.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండన
రాయబారుల ఉపసంహరణ చర్యలు
ఉగ్రవాద స్థావరాలపై దాడుల పేరిట ఇరాన్ జరిపిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారికత్వాన్ని దెబ్బతీయడమే, ఇరుదేశాల మధ్య స్నేహం, చారిత్రక సంబంధాలను ఉల్లంఘించినట్లే అయిందని విమర్శించారు. ఈ పరిణామం తీవ్రస్థాయి పర్యవసానాలకు దారితీస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఇరాన్‌లోని పాకిస్థాన్ రాయబారిని స్వదేశానికి పిలిపిస్తున్నట్లు, ఇప్పుడు ఇరాన్ పర్యటనలో ఉన్న తమ దేశ ఇరాన్ రాయబారి ప్రస్తుతానికి పాకిస్థాన్‌కు రావల్సిన అవసరం లేదని ఆదేశాలు వెలువరించింది. ఈ పరిణామంతో ఇప్పుడు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయినట్లు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News