Sunday, December 22, 2024

అమెరికా ఓటర్లకు ‘యుద్ధ’ భయం

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పశ్చిమాసియాకు సంబంధించి మూడు అంశాలు ప్రభావం చూపనున్నాయి. మొదటి అంశం.. అనుకున్నట్టుగానే ఇరాన్ మిలిటరీ వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. అయితే ఇక్కడ అసాధారణం ఏమంటే అంతవరకు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్నప్పటికీ ఆ దాడులను తామే చేశామని కమిట్ కావడం, దానికి ఇరాన్ ప్రతిస్పందించడం, ఫలితంగా పశ్చిమాసియా అస్థిరతకు గురికావడం ఇవన్నీ చర్చకు కేంద్ర బిందువు అయ్యాయి. ఇది అమెరికాలోని ఏడు స్వింగ్ స్టేట్‌ల్లో ఒకటైన మిచిగన్ వంటి స్వింగ్ స్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మిచిగన్ రాష్ట్రంలో పాలస్తీనియన్లతో పాటు లెబనీస్ అమెరికన్లు భారీ సంఖ్యలో ఉన్నారు. 2020లో బైడెన్ విజయానికి వీరే పరోక్షంగా దోహదం చేశారు.

అయితే గత ఏడాది అక్టోబర్ 7 తరువాత నుంచి ఇజ్రాయెల్‌కు డెమొక్రాట్ల మద్దతు కొనసాగుతుండటం, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా దౌత్యపరమైన చర్చలు జరపడంలో బైడెన్ విఫలం కావడం తో డెమొక్రాట్లపై పాలస్తీనియన్లు, లెబనీస్ అమెరికన్లు వ్యతిరేకత చూపిస్తున్నారు. మొన్న శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కూడా వీరిపై ప్రభావం చూపిస్తున్నాయి. రెండో అంశం.. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన తరువాత చమురు ధరలు 910 శాతం పెరిగినప్పటికీ, యుద్ధం ఇంకా తీవ్రం కానున్నాయని హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రపంచ ఇంధనం మార్కెట్ తగిన విధంగా స్పందించలేదు. ఇంధనం మార్కెట్‌లో ఇరాన్ లేకపోవడం వల్ల వచ్చే నష్టాలను తట్టుకునే తగినంత శక్తిసామర్థాలు అమెరికా, సౌదీ అరేబియాలకు ఉన్నాయన్నది కొత్తగా వెలుగులోకి వచ్చిన వాస్తవం.

చైనా ఇరాన్ నుంచి 90 శాతం వరకు చమురును కొనుగోలు చేస్తుంది. అది చైనా అవసరాల్లో 15 శాతం వరకు సరిపోతుంది. మిగతా అవసరాల కోసం రష్యా, సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రపంచ మార్కెట్‌లో ఇంధనం ధరలు ఏమాత్రం పెరిగినా, డొమెస్టిక్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతాయని అమెరికా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అమెరికా పోలింగ్‌కు ముందు ఇది పెద్ద సమస్య కానున్నది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టులేదు. మరి కొన్నాళ్లు సాగుతుందన్న భయం ప్రజల్లో వెంటాడుతోంది. శనివారం నాడు తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సాగించినప్పటికీ, ఆ దాడుల వల్ల నష్టం తక్కువే జరిగిందని ఇరాన్ తేలికగా తీసుకుంది. తాము అనుకున్న లక్షాల మేరకు ఇంధనం / అణు క్షిపణి వ్యవస్థలపై కచ్చితంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించిన తరువాత అమెరికా ఒత్తిడిపై కొంతవరకు ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది.

ఎలాగైతేనేం పశ్చిమాసియా సంఘర్షణలపై అమెరికా నియంత్రణ దాదాపు లేనట్టే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా అమెరికా పరిస్థితి ఇంతే. ఉదాహరణకు ట్రంప్ తాను గెలిస్తే ఈ రెండు యుద్ధాలను ఆపగలుగుతానని హామీ ఇస్తున్నారు. నిజానికి ఆయనకు అంత సామర్థం లేదు. రెండు యుద్ధాల మరో దశ మాత్రం అమెరికా అధ్యక్షునిగా ఎవరు పగ్గా లు చేపడతారో వారిపై ఆధారపడి ఉంది. మూడో అంశం.. ట్రంప్ ఎలాన్ మస్క్ సంబంధం. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ. 168 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్‌ను కొత్త ప్రభుత్వ పార్లమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతిగా నియమించనున్నట్టు కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ చైర్మన్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు.

అలాంటి ట్రంప్‌తో గట్టి సంబంధం ఉన్న ఎలాన్‌మస్క్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా అత్యంత సన్నిహిత సంబంధం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెలువడడం సంచలనం కలిగిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలాన్ మస్క్ కూడా ట్రంప్ గెలిస్తే రష్యాకే అండదండలు అందిస్తాడని, ఉక్రెయిన్‌కు చిక్కులు తప్పవని ఒక ఇంటర్వూలో వెల్లడించడం ఈ సందర్భం గా ప్రస్తావించవలసి ఉంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం చివరకు ఎంతవరకు దారి తీసిందంటే దీనిపై నాసా చీఫ్‌ను దర్యాప్తు చేయాల్సిందిగా డిమాండ్ పెరిగింది. మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో అమెరికా ప్రభుత్వ మల్టీ బిలియన్ డాలర్ల కాంట్రాక్టుల సంబంధం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మస్క్ చేరువగా ఉంటున్నారన్న ఆరోపణలను రష్యా ఖండించింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయడానికి రష్యా జోక్యం చేసుకుందన్నది బాగా ప్రచారమైంది. కమలా హారిస్‌కు మద్దతుగా సాగుతున్న ప్రచారంలో ఇది ప్రధాన అంశంగా మారనున్నది. ఎవరు తదుపరి అధ్యక్షునిగా విజయం సాధించినా పశ్చిమాసియా యుద్ధాలపై వారి దౌత్యరాజకీయ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వినవస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News