Sunday, December 22, 2024

ఇరాన్ దాడులు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన ప్రశ్న. బలప్రయోగం ద్వారా వారిని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బుధవారం నాడు పాకిస్తాన్, సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఇరాన్ సైన్యం జరిపిన దాడులు ఆశ్చర్యం కలిగించాయి. పాక్‌పై వైమానిక దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారు, మరి ముగ్గురు బాలలు గాయపడ్డారు. ఈ దాడుల్లో ఇరాన్ డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించింది. జైష్ అల్ -అది అనే ఉగ్రవాద ముఠాను అంతమొందించడానికే ఈ దాడులకు పాల్పడినట్టు ఇరాన్ ప్రకటించింది. సహజంగానే దీనిని పాక్ తీవ్రంగా ఖండించింది.

ఎటువంటి కవ్వింపు లేకుండానే తమ గగనతల హద్దులను ఉల్లంఘించి ఇరాన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని పాక్ ప్రకటించింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులతో ఘర్షణలు ఇరాన్‌కు కొత్త కాదు. పొరుగు దేశంలోకి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లో ఈ మాసారంభంలో 90 మందిని బలి తీసుకొన్న జంట బాంబు పేలుళ్ల వెనుక గల టెర్రరిస్టులను మట్టుబెట్టడం కోసమే ఈ దాడులకు సమకట్టినట్టు బోధపడుతున్నది. ఇరాన్ రెవొల్యూషనరీ గార్డ్ దళాలు పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో గల లక్షాలపై ఈ దాడులు జరిపాయి. జైష్ అల్ -అది సున్నీ మిలిటెంట్ సంస్థ. ఇరాన్‌లోని సిస్టన్ బలూచిస్థాన్‌లో గల సున్నీ మైనారిటీల పట్ల టెహ్రాన్‌లోని షియాల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని వారిని అణచివేస్తున్నదని జైష్ భావిస్తున్నది. అందుకు వ్యతిరేకంగా పోరాడడానికి అది ఏర్పాటయింది. ఇరాన్‌లో షియాలు మెజారిటీ వర్గం. ఇరాన్ పాక్‌ల మధ్య పరస్పర వ్యతిరేక టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి.

అయినా అవి తమ మధ్య సంబంధాలను ఒక మాదిరిగా కాపాడుకొంటున్నాయి. ఈ దాడులు రెండు దేశాలను దూరం చేసి వైషమ్యాలను పెంచే అవకాశాలున్నాయి. సైనికంగా పాక్, సిరియా, ఇరాక్‌ల కంటే ఇరాన్ బలమైనది. ఆ ధీమాతోనే అది ఈ దాడులకు సాహసించిందని బోధపడుతున్నది. డ్రోన్‌లు, క్షిపణుల దాడుల్లో పాకిస్తాన్‌లో గల జైష్ అల్ -అది స్థావరాలు రెండింటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి గత డిసెంబర్‌లో జరిగిన ఒక దాడిలో 11మంది ఇరాన్ పోలీసులు మరణించారు. ఈ దాడి తాము చేసిందేనని జైష్ ప్రకటించింది. అలాగే గత ఏడాది జులై 23న సరిహద్దుల సమీపంలో గస్తీ విధుల్లోని ఇరాన్ పోలీసులపై దాడిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. టెర్రరిస్టులకు పాక్ ఆశ్రయమిస్తున్నదనే ఆరోపణ తెలిసిందే. అమెరికా అయినా, ఇరాన్ అయినా మరింక ఏ దేశమైనా టెర్రరిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇతర దేశాల భూభాగాలపై జరిపే దాడుల్లో అమాయకులు బలి అయిపోతున్నారు. నిస్సహాయులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. టెర్రరిస్ట్ స్థావరాల గురించి తమ వద్ద గల సమాచారాన్ని పొరుగు దేశానికి అప్పగించి చర్య తీసుకోవాలని కోరే పద్ధతిని అవలంబించవచ్చు.

అప్పటికీ ప్రయోజనం కలగకపోతే ఇతర మార్గాలను ఎంచుకోడాన్ని కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమాసియా ఇప్పటికే రగులుతున్న అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. గాజాలో ఇజ్రాయెల్ విరామం ఇవ్వకుండా సాగిస్తున్న దాడుల్లో ఇప్పటికి 24,000 మంది జనం చనిపోయారు. ఇంకొక వైపు యెమెన్‌లోని హౌతీలు ఎర్ర సముద్ర మార్గాన్ని అడ్డుకొని వాణిజ్య నౌకలపై దాడులు సాగిస్తున్నాయి. ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్ వైపు రవాణా మార్గంలో అంతులేని హింసకు పాల్పడుతున్నారు. యెమెన్‌లోని వీరి మూలాలపై అమెరికా ఇటీవలనే వైమానిక దాడులు జరిపింది. ఇంకొకవైపు ఇరాన్‌కు అనుకూలురైన హిజ్ బొల్లా మిలిటెంట్ల గురించి తెలిసిందే. వీరు లెబెనాన్ కేంద్రంగా దాడలుకు పాల్పడుతున్నారు.

ఇరాన్ సైన్యం పొరుగు దేశాలతో గల సరిహద్దులను ఉల్లంఘించి చేసిన ఈ దాడులు పశ్చిమాసియాను మరింతగా భగ్గుమనిపించే ప్రమాదం కనిపిస్తున్నది. పాక్, ఇరాక్‌లు ప్రతీకారానికి పాల్పడగల అవకాశాలు లేకపోలేదు. అటువంటి పరిస్థితిని అమెరికా తన ప్రయోజనాలకు వినియోగించుకొనే ప్రమాదం ఉన్నది. ఇరాక్ పై ఇరాన్ దాడులను అమెరికా ఖండించింది. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో గల ఎర్బిల్ పై ఇరాన్ డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒక కుర్దిష్ వ్యాపారి, ఆయన ఏడాది కుమార్తె మరణించినట్టు సమాచారం. ఇక్కడ గల ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయాల్లో ఒక దానిని కూల్చివేసినట్టు తెలుస్తున్నది. అమెరికా సహన పరిధిలు దాటకుండా ఇరాన్ తెలివిగా తమపై దాడులు చేసిందని కుర్దులు ఆక్షేపించడం గమనించవలసిన విషయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News