వంద మందికిపైగా దుర్మరణం
వందలాది మందికి తీవ్రగాయాలు
జనరల్ సులేమానీ సంస్మరణలో ఘటన
ఉగ్రవాద చర్యగా నిర్ధారణ ..దర్యాప్తు
వంద మందికిపైగా దుర్మరణం, వందలాదికి తీవ్రగాయాలు
ఉగ్రవాద చర్యగా నిర్థారణ.. దర్యాప్తు
టెహ్రాన్ : ఇరాన్‌లో బుధవారం జరిగిన జంటపేలుళ్లలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంత నగరం కెర్మాన్‌లో ఈ వరుస పేలుళ్లు రక్తపాతానికి దారితీశాయి. ఇక్కడ ఖననవాటికలో జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమం దశలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇవి ఉగ్రవాద చర్యలని అధికారులు తెలిపారు. దాదాపు 103 మంది వరకూ చనిపోయినట్లు, వంద మంది వరకూ గాయపడినట్లు అధికారులు తెలిపారు. 2020లో అమెరికా డ్రోన్ల దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి చెందారు. ప్రతి ఏటా ఇక్కడ ఆయన సంస్మరణలో జనం హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దొంగదెబ్బకు దిగి ఉంటారని అధికారులు తెలిపారు.
ఖననవాటికకు వెళ్లే దారిలో ఉగ్రవాదులు రెండు మందుపాతరలను అమర్చి, అదును చూసుకుని వీటిని రిమోట్ కంట్రోలు ద్వారా పేల్చివేశారని నిర్థారణ అయింది. జనం ఈ సైనిక కమాండర్‌కు నివాళులు అర్పిస్తున్నప్పుడే పేలుళ్లు జరిగాయి. దీనితో ఇక్కడ భీతావహక పరిస్థితి నెలకొంది. ఘటన గురించి ఇరానీ అధికారిక వార్తా సంస్థ ఇర్నా పలు కథనాలతో వార్తలు వెలువరించింది. పరిస్థితి గురించి ఇరాన్ అత్యయిక సేవల విభాగం ప్రతినిధి బాబక్ యెకతపరాస్త్ వివరణ ఇచ్చారు. పేలుళ్లలో 73 మంది వరకూ చనిపోయారని, 170 మంది గాయపడ్డారని తెలిపారు. అయితే టీవీలలో కనీసం వంద అంతకు మించి బలి అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ కూడా ప్రకటనలు వెలువరించలేదు. ఖనన వాటిక చుట్టుపక్కల ప్రాంతం అంతా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి.
ఈ ప్రాంతం నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టినా , భారీ స్థాయిలో విపరీత శబ్దాలతో పేలుళ్లు జరిగాయని , ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఈ ప్రాంతపు స్థానిక అధికారి రెజా ఫల్లా తెలిపారు. ఖాసీం ఇరాన్‌కు చెందిన సునిశిత ఖ్వాడ్ బలగాలచీఫ్ కమాండర్‌గా వ్యవహరించారు. విదేశాలలో ప్రత్యేకించి అమెరికాలో ఆయన ఆధ్వర్యంలోనే వేగు చర్యలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవని వెల్లడైంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ప్రాబల్యం ఆటకట్టు దిశలో ఇరాన్ సాగిస్తూ వచ్చిన సుదీర్ఘ పోరులో ఆయన అత్యంత కీలక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలోనే ఆయన అమెరికా డ్రోన్ల దాడిలో హతులయ్యారు. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణలు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో జరిగిన ఈ ఘటన సంచలనాత్మకం అయింది. హామాస్‌పై దాడి దశలో పాలస్తీనియన్ల పట్ల సాగుతోన్న ఊచకోతను ఇరాన్ నిరసిస్తోంది.