Tuesday, January 21, 2025

అమెరికా వైఖరి ఎవరికి లాభం?

- Advertisement -
- Advertisement -

ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పేట్రేగిపోవడానికి, మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడానికి అగ్రరాజ్యం అమెరికా వైఖరియే పరోక్ష కారణంగా విశ్లేషకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమనడానికి వెనుక నుండి ఒక వర్గానికి ఏకపక్షంగా అమెరికా కొమ్ముకాస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరాన్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అరగంటసేపు ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సైన్యానికి ఇజ్రాయెల్‌కు సహాయంగా రంగంలోకి దూకాలని పిలుపు ఇవ్వడం తీవ్రంగా ఆక్షేపించవలసిన విషయం. ఇరాన్ క్షిపణుల దాడి చేస్తుందని అంతకు రెండు గంటలకు ముందే ఇజ్రాయెల్‌ను హెచ్చరించడం కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. పశ్చిమాసియాలో రావణ కాష్ఠంలా రణజ్వాలలు ఎగసిపడుతుంటే మధ్యవర్తిత్వం వహించి ఆయా దేశాల మధ్య ప్రతీకారాగ్నిని చల్లార్చవలసిన అగ్రరాజ్యం ఆ మంటలకు చలికాచుకుంటుండడంలో వ్యూహం ఏమిటి? ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ వీరంతా ఒకరినొకరు దాడులతో, ప్రతిదాడులతో దేశాలను శ్మశానంగా మార్చి, ప్రజానీకంలో కనీసం రోగులనైనా కొనఊపిరితో బట్టకట్టనీయకుండా మారణహోమం సాగుతుంటే మిగిలిన నెత్తురుటేరుల మట్టిని ఎవరైనా ఎలా పాలించగలుగుతారు? పాలించి ఏం సాధిస్తారు.

ఇది కేవలం రాక్షసత్వం తప్ప మరేం కాదు. అగ్రరాజ్యం అమెరికా ఇదంతా ఏమీ పట్టనట్టు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా తన మిత్రపక్షం ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్‌కు, హమాస్ సంస్థకు గాజాలో సాగుతున్న యుద్ధంలో తక్షణం మానవతాయుతంగా కాల్పుల విరమణను పాటించాలంటూ ఐక్యరాజ్యసమితి కొన్ని నెలల క్రితమే చొరవ తీసుకుని భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదించగా వీటో అస్త్రం ద్వారా అమెరికా మోకాలడ్డడం ఎవరూ మర్చిపోలేదు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారుతున్నదని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అత్యంత మానవ విషాదాన్ని అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి అరుదుగా ప్రయోగించే నిబంధన కింద ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 15 మంది సభ్యులు గల భద్రతా మండలిలో తీర్మానానికి అనుకూలంగా 13 మంది ఓటు వేయగా, బ్రిటన్ గైర్హాజరైంది. అమెరికా ఒక్కటే వీటోను ప్రయోగించి తీర్మానం అమలులోకి రాకుండా నీరు కారించింది.

ఈ తీర్మానం అమలైతే హమాస్‌కే మేలు జరుగుతుందని ఆనాడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వితండవాదన లేవదీశాయి. ఇజ్రాయెల్‌పై మొదట హమాస్ జరిపిన దాడిలో 1700 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో హమాస్ కొంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకెళ్లింది. ఇదంతా వాస్తవమే. కానీ బందీలను విడిపిస్తామని, హమాస్‌ను మట్టుబెడతామని ఇజ్రాయెల్ అప్పటి నుంచి సాగిస్తున్న దాడుల్లో ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారో ప్రపంచానికి తెలిసిందే. 1967 లో వారం రోజుల పాటు జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలెం సహా జోర్డాన్ నది పశ్చిమతీరం, గాజా ప్రాంతం ఇజ్రాయెల్ స్వాధీనమైపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నారు. వారికి గుర్తింపు పొందిన సొంత భూభాగమంటూ లేదు.

ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు రెండూ ఇరుగుపొరుగున శాంతియుత సహజీవనం సాగించేలా ఏర్పాటు జరగాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, అందుకు అమెరికా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్ అవతరించి గాజా భూభాగంలోని పాలస్తీనియన్ల మద్దతు పొందుతోంది. అమెరికాలో అధికారంలోకి ఎవరు వచ్చినా అక్కడి యూదు ఓట్ల పరంగానూ, అరబ్ దేశాలను అణచి ఉంచే కుతంత్రం కోసం అంతర్జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించడం కోసం స్వతంత్ర పాలస్తీనా వ్యతిరేక వైఖరిని అమెరికా కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దురాక్రమణకు కొమ్ముకాస్తూ వస్తోంది. పాలస్తీనాకు స్వతంత్ర దేశాన్ని ఇవ్వనంత వరకు ఇలాగే పరస్పర దాడులు కొనసాగుతూ ఉంటాయి. మారణ హోమం, రక్తపాతం తరచుగా సంభవిస్తూనే ఉంటాయి.

ఇజ్రాయెల్‌కు దాని మద్దతుదారులైన అమెరికా, పాశ్చాత్య దేశాలకు కావలసింది కూడా ఇదే. అంతర్జాతీయ రంగంలో అమెరికా బలం సన్నగిల్లితే కానీ ఇజ్రాయెల్ దారికి వచ్చే సూచనలు లేవు. మరోపక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎంతకాలం ఇంకా కొనసాగుతుందో చెప్పలేం. ఉక్రెయిన్ సొంత బలంతో కాకుండా అమెరికా నుంచి లభించే ఆయుధ సాయంతో రష్యాతో ఢీకొంటోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చైనా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనియన్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News