ప్రపంచ ఆంక్షలకు అతీతంగా సాయం
టెహ్రాన్ : చమురు ఇంధన భద్రత అవసరాల విషయంలో భారతదేశానికి తగు విధంగా సాయం అందిస్తామని, అవసరాలు తీరుస్తామని ఇరాన్ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభం దశలో చమురు సంపన్న దేశం ఇరాన్ నుంచి ఇండియాకు ఈ కీలక హామీ లభించింది. భారతదేశంలోని ఇరాన్ రాయబారి ఇక్కడి అధికార వర్గాలకు ఈ విషయంలో తగు భరోసా ఇచ్చారు. ఒపెక్ సభ్యదేశంపై ఆంక్షల తొలిగింపు ప్రక్రియ ఇప్పుడు జోరందుకుంది. ఈ క్రమంలో ఇరాన్, ప్రపంచ సంపన్న దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారతదేశానికి ఇరాన్ రెండో అతి పెద్ద చమురు సరఫరా దేశంగా ఉంది.
ఇరాన్ అమెరికా మధ్య ఆంక్షలపర్వం, ట్రంప్ హయాంలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ దశలోనే ఇరాన్ నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, అమెరికాతో డీల్ రద్దు పరిణామాలను పట్టించుకోకుండా మూడోపక్షం ప్రసక్తి లేకుండా రూపీ రియాల్ వ్యాపార చట్రం కొనసాగడం వల్ల ఉభయదేశాల కంపెనీలకు మేలు జరుగుతుందని ఇరాన్ ప్రతినిధి అలీ చెగెని భారత్‌కు తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు వినియోగపు దిగుమతుల దేశంగా భారత్ ఉంది. ముడి చమురు అవసరాలలో 80 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయంగా ఇతర దేశాల పరస్పర ఆంక్షల దశలో వీటి ప్రభావం తమ చమురు అవసరాలపై పడుతున్నందున దీనిని జాగ్రత్తగా బేరీజు వేసుకుని ముందుకు సాగాల్సి ఉందని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.