Sunday, December 22, 2024

వెనక్కు తగ్గిన ఇరాన్ పాలకులు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఇరాన్, చైనాలలో ఒకేసారి సంకెళ్ళ సడలింపు సవ్వడులు వినిపించడం మంచి పరిణామం. నిరంకుశ నిర్ణయాలు తోక ముడవడం హర్షించవలసిన అంశం. ప్రజలను అసౌకర్యానికి గురి చేసే నియమాలు నిరంతరం కొనసాగబోవనే సత్యాన్ని ఈ రెండు దేశాల పాలకులు తెలుసుకొన్నారని బోధపడుతున్నది. జీరో కొవిడ్ ఊపిరిసలపనీయని వాతావరణాన్ని చైనా ప్రజలు ధిక్కరించారు. వీధుల్లోకి వచ్చిన వేలాది మంది మనసు తెలుసుకొన్న దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ వెనక్కి తగ్గారు. అలాగే ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమ ఉధృతిని గమనించిన అక్కడి మత నియంతలు ఒక అడుగు వెనక్కి వేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మితవాద అణచివేత శృతి మించితే జన చైతన్యం దానిని ధిక్కరించి తీరుతుందని ఈ రెండు దేశాల పరిణామాలు రుజువు చేశాయి.

మన దేశంలోనైనా మెజారిటీ మతతత్వం ఉక్కు పాదం మోపితే దానిని శాశ్వతంగా తొలగించడానికి అన్ని వర్గాల ప్రజలు ఏకమవుతారని గ్రహించవలసి వుంది. మహిళల వస్త్రధారణలో ఇస్లాం మత నియమాలను వీసమెత్తు లోపం లేకుండా పాటించేలా చూడడానికి, హిజాబ్ (తల గుడ్డ) ధారణలో ఎటువంటి అతిక్రమణకు పాల్పడకుండా కట్టడి చేయడానికి నియమించిన నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మొంతాజరి ప్రకటించినట్టు ఒక వార్తా సంస్థ శనివారం నాడు వెల్లడించింది. మోరల్ పోలీసులు ఇరాన్ న్యాయ వ్యవస్థలో అంతర్భాగం కారని ఆయన వివరించినట్టు తెలిపింది. రెండున్నర మాసాలుగా ఇరాన్‌లో సాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళన సాధించిన అసాధారణ విజయమిది. ఈ ఆందోళనలో 300 మంది మరణించారని అధికారిక సమాచారం. వారి సంఖ్య 448 మంది అని ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రకటించింది.

మరణించిన వారిలో భద్రతా సిబ్బంది కూడా వున్నారు. ఉద్యమ క్రమంలో అరెస్టయిన వేలాది మందిలో ఇరాన్ నటులు సహా అనేక మంది ప్రముఖులున్నారు. మహసా అమిని అనే 22 ఏళ్ళ కుర్దిష్ వనితను హిజాబ్ సరిగా వేసుకోలేదన్న కారణం చూపి టెహ్రాన్‌లోని నైతిక పోలీసులు అరెస్టు చేసిన తర్వాత మూడు రోజులకు వారి నిర్బంధంలో ఆమె చనిపోయారు. దీనితో ఆగ్రహించిన ఇరానియన్లు గత సెప్టెంబర్ 16న మొదలు పెట్టిన ఉద్యమం అంచెలంచెలుగా పెరిగి ఉధృతమైంది. దేశ వ్యాప్తంగా రోడ్డు రవాణా స్తంభించిపోయే పరిస్థితి ఎదురైంది. మహిళలు వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లను పోగులుపెట్టి దగ్ధం చేశారు. అసలే అమల్లో వున్న అమెరికా ఆంక్షలకు తోడు ఈ ఉద్యమం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పాలకులు గమనించారు. ప్రజల వాస్తవమైన డిమాండ్ల వైపు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఇరాన్ పార్లమెంటు సభ్యుడొకరు ఆదివారం నాడు ప్రకటించారు.

అయితే ఈ ఉద్యమానికి మూలంలో ఉన్నది ప్రజల్లో పేరుకుపోయిన ఆర్థిక అసంతృప్తేనని ఇరాన్ పాలకులు భావిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాని అక్కడి మహిళల్లో రగులుతున్న చైతన్యాన్ని, మిత, మతవాద నియంతృత్వం పట్ల ఎగసిపడుతున్న తిరుగుబాటు జ్వాలలను పూర్తిగా అర్ధం చేసుకోడంలో ఇరాన్ పాలకులు విఫలమైతే వారు ఇటువంటి మరిన్ని ఉద్యమాలను ఎదుర్కోవలసి వస్తుంది. 1979లో ఇస్లామిక్ విప్లవం ద్వారా షా పాలనను అంతమొందించిన తర్వాత ఇస్లామిక్ పాలకులు మహిళలకు, పురుషులకు కూడా వస్త్రధారణ క్రమశిక్షణను అమలు చేయడం ప్రారంభించారు. తీవ్ర మితవాది అయిన మహ్మూద్ అహ్మదీ నెజాద్ దేశాధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత మహిళలు విధిగా హిజాబ్ ధరించేలా చూడడానికి గస్తీ పోలీసు విభాగాన్ని నైతిక పోలీసులనే పేరిట నియమించారు.

హిజాబ్ ధారణతో పాటు మహిళలు జీన్స్ వంటి ఆధునిక దుస్తులు ధరించకుండా చూసే బాధ్యతను వీరికి అప్పగించారు. అప్పటి వరకు గల ఉదారవాద అధ్యక్షుడు హసన్ రౌహానీ హయాంలో జీన్స్ ధరించే స్వేచ్ఛను కూడా మహిళలు అనుభవించారు. 2006 నుంచి తమపై విరుచుకుపడిన వదులు దుస్తులు, హిజాబ్ నిబంధన పట్ల ఇరాన్ మహిళలలో క్రమంగా వ్యతిరేకత పేరుకుపోతూ వచ్చింది. ఈ ఏడాది జులైలో మితవాద అధ్యక్షుడు రైసీ హిజాబ్ ధారణ నియమాన్ని మరింత కఠినంగా అమలు చేయడానికి నిర్ణయించడంతో ఆ ప్రతిఘటన భావజాలం ఉన్నపళంగా పెల్లుబికి మహసా అమిని దుర్మరణంతో పరాకాష్ఠకు చేరుకున్నది. హిజాబ్‌ను సవ్యం గా వేసుకోకపోతే జైలు శిక్షను కూడా విధిస్తూ వచ్చారు. పురుషాధిపత్యం కరడుగట్టిన చోట సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడే బాధ్యతను మహిళలపైనే వుంచి వారిని ప్రతిదానికి తప్పుపడుతూ శిక్షిస్తూ వుండడం చూస్తూనే వున్నాము. ఇది కొనసాగడానికి వీల్లేదని ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఉద్యమాలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా పాలనలో మిత, మతవాద ధోరణులు చొరబడి పెరుగుతున్నాయి. ఇది మంచి సంకేతం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News