Wednesday, January 22, 2025

మునుపెన్నడూ ఉపయోగించని ఆయుధాలు ఉపయోగిస్తాం!

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ కు ఇరాన్ బెదిరింపు

టెల్ అవీవ్: ఇరాన్ దాడికి జవాబివ్వడానికి ప్రధాని బెంజామిన్ నెతన్యాహు అనుమతి కోసం వేచి ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ హెర్జీ హలేవి సోమవారం తెలిపారు. కాగా దీనికి ఇరాన్ బదులిస్తూ ఇజ్రాయెల్ దాడికి సెకండ్లలో బదులిస్తామని, పైగా ఇదివరకెన్నడూ ఉపయోగించని ఆయుధాలను ఉపయోగిస్తామని హెచ్చరించింది. యూదుల చర్యలకు తగురీతిలో బదులిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇదిలావుండగా ఇరాన్ నేరుగా దాడి చేశాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు 24 గంటల్లోనే వార్ క్యాబినెట్ ను రెండో సారి సమావేశపరిచారని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది.

గాజా యుద్ధం పెచ్చరిల్లుతుండడంతో అమెరికా, ఇజ్రాయెల్ కు తోడ్పడింది. అయితే ఇజ్రాయెల్ ప్రతి దాడులకు పూనుకుంటే మాత్రం తాము దూరంగా ఉంటామని కూడా స్పష్టం చేసింది. అంటే ఇరాన్ ను నివారించేంత మేరకే అమెరికా, ఇజ్రాయెల్ కు సహకరించనున్నది. ఇదిలావుండగా ఇరాన్ 300 కు పైగా డ్రోన్లను, మిస్సైల్స్ ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. కాగా ఆ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యాలని ఛేదించేలోగా అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇతర దేశాల సహకారంతో అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది.

డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడులు చేసి తమ హైర్యాంకింగ్ జనరల్స్ సహా 12 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ఇరాన్, ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. తమ రాయబార కార్యాలయంపై దాడి చేయడమంటే తమ భూభాగంపై దాడి చేయడం వంటిదేనని ఇరాన్ పేర్కొంది.

గాజా ప్రాంతంలో హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గత ఆరు నెలలుగా పోరాడుతోంది. ఇరాన్ మద్దతుతో హమాస్, ఇస్లామిక్ జిహాద్ అక్టోబర్ 7న సీమాంతర దాడులకు పాల్పడ్డాయి. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దాని వల్ల పెద్ద ఎత్తున నష్టం, 33 వేలకు పైగా హతులవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News