Wednesday, January 22, 2025

ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధం..మధ్యలో తలదూర్చొద్దు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున పోరుకు తాము సిద్ధం అవుతున్నామని ఇరాన్ తెలిపింది. అమెరికా ఇతర దేశాలు ఇజ్రాయెల్ తరఫున నిలవరాదని, తరువాతి పరిణామాలకు వారిదే బాధ్యత అని హెచ్చరించింది. మీరు మధ్యలో తలదూర్చరాదని అమెరికాకు శనివారం ఇరాన్ చురకలకు దిగడంతో అసలే గాజా యుద్ధంతో రగిలిపోతున్న పశ్చిమాసియా పరిస్థితి మరింత దిగజారింది. సిరియాలోని తమ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయించిందని ఇరాన్ అనుమానిస్తోంది. ప్రతీకారంతో రగిలిపోతోంది. కాగా వెస్ట్ ఆసియాలో ఇరాన్ పరోక్ష శక్తి అయిన హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌ను ఇక దెబ్బకాచుకో అని హెచ్చరించింది. దీనితో ఇజ్రాయెల్ నేత నెతన్యాహు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వలలో పడరాదని ఇరాన్ ఏకంగా ఓ లేఖను అమెరికా అధికార యంత్రాంగానికి పంపించింది. ఇరాన్ అధ్యక్షుడికి అత్యంత కీలక సన్నిహితులు, రాజకీయ సలహాదారుడి పేరిట ఎక్స్‌లో కూడా ఈ సందేశం వెలువరించారు.

పక్కకు తప్పుకోండి లేకపోతే దెబ్బ తప్పదనే రీతిలో ఈ ఘాటు సందేశం పంపించారు. ఈ లేఖపై అమెరికా వెంటనే స్పందించింది. తమ స్థావరాలపై దాడికి దిగకుండా ఉంటే మంచిదని తెలిపింది. రంజాన్ మాసం చివరి శుక్రవారం ముగిసిన తరువాత ఇజ్రాయెల్‌పై పవిత్రదాడులకు దిగాలని ఇరాన్ సంకల్పించినట్లు, దీనితో ఈ ప్రాంతంలో భీకరపోరు పరిస్థితి తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితిని అయినా ఎదుర్కోవాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. మరో వైపు తమ దేశపు స్థావరాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌లో ఉన్న అమెరికా సైనిక లేదా ఇంటలిజెన్స్ కేంద్రాల వద్ద నిశిత నిఘాను పెంచారు. పర్యవేక్షణ ఉధృతం చేశారు. తమకు డమాస్కస్‌లో ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడికి ఎటువంటి సంబంధం లేదని, వార్తల్లోనే ఈ విషయం తెలిసిందని బైడెన్ అధికార యంత్రాంగం ఇరాన్‌కు తెలియచేసింది. కాగా ఇజ్రాయెల్ తమ బద్ధశత్రువు అని , దెబ్బకు దెబ్బతీసి తీరుతామని ఇరాన్ హెచ్చరించింది.

అయితే ఇరాన్ సేనలు నేరుగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతాయా? లేక తమ పరోక్ష శక్తుల సాయంతో దాడులు నిర్వహింపచేస్తారా? అనేది వెల్లడికాలేదు. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, ఇప్పటికీ గాజాలో రణరంగం నెలకొని ఉంటున్న దశలోనే ఇప్పుడు అత్యంత కీలక సమానబల వైరి పక్షాలు ఇరాన్ ఇజ్రాయెల్ తలపడితే పరిస్థితి ఏమిటనేది అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News