దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‌బిలో భాగంగా శుక్రవారం వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 20 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు ఇరాన్ అటు వేల్స్ ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇక ఇరాన్ కాస్త పైచేయి సాధించినా గోల్స్ సాధించడంలో విఫలమైంది. మరోవైపు వేల్స్ కూడా అద్భుత ఆటతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
ప్రథమార్ధంలో రెండు జట్లు కూడా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక పోయాయి. ఇరాన్‌కు పలుసార్లు గోల్ చేసే అవకాశం లభించినా ఫలితం లేకుండా పోయింది. ద్వితీయార్ధంలో కూడా హోరాహోరీ తప్పలేదు. అయితే ఈసారి కూడా నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. కానీ ఇంజ్యూరీ టైమ్‌లో ఇరాన్ వెంటవెంటనే రెండు గోల్స్ సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. 98వ నిమిషంలో రూజ్‌బే చెష్మీ తొలి గోల్ నమోదు చేశాడు. మూడు నిమిషాల తర్వాత రామిన్ రిజయాన్ మరో గోల్ సాధించడంతో ఇరాన్‌కు చారిత్రక విజయం దక్కింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇరాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇరాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.