ఇరాక్‌లోకి దూసుకువచ్చిన ఇరాన్ మిస్సైల్స్
అమెరికా టార్గెట్‌గా భారీ స్థాయి దాడి?
యుఎస్ కాన్సులేట్ వద్ద విధ్వంసం
ఉక్రెయిన్ వార్ దశలో గల్ఫ్ మంటలు
ఖండనలు, వివరణలతో కలవరం
బాగ్దాద్ : గల్ఫ్ ప్రాంతంలో ఆదివారం ఉన్నట్లుండి భయానక పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన దాదాపు 12 క్షిపణులు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో వచ్చి పడ్డాయి. ఇరాక్ సిటీ ఇర్బిల్‌లో సువిశాలమైన అమెరికా కాన్సులేట్ కాంప్లెక్స్ ఆవరణలోనే ఈ క్షిపణలు భీకర స్థాయిలో వచ్చిపడటంతో ప్రకంపనలు చెలరేగాయి. ఇరాన్ నుంచి ఇరాక్‌పై ప్రయోగించిన క్షిపణులు భారీ సంఖ్యలో విరుచుకుపడటం ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా రష్యాల మధ్య ఆంక్షల పోరు నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో ఆందోళనకు దారితీసింది. అయితే పలు మిస్సైల్స్ వచ్చిపడ్డప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం అయింది. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఇర్బిల్‌లోని అమెరికా కాన్సులేట్‌ను లక్షంగా చేసుకునే ఇరాన్ దాడికి దిగిందని బాగ్దాద్‌లో అధికారులు తొలుత ప్రకటించారు. అయితే ఏ ఒక్క క్షిపణి కూడా అమెరికా భవనాలపై పడలేదని, ఎటువంటి నష్టం జరగలేదని కుర్దీస్థాన్ విదేశీ మీడియా కార్యాలయ ప్రతినిధి లాక్ గఫారీ తరువాత తెలిపారు.
అయితే జరిగిన పరిణామాలపై తాము ఆరాతీస్తున్నామని, ఎన్ని క్షిపణులు ఎక్కడ వచ్చిపడ్డాయనేది అధికారికంగా తెలుసుకుంటున్నామని అమెరికా రక్షణ వర్గాలు వాషింగ్టన్‌లో తెలిపాయి. నిజాలు నిర్థారించిన తరువాతనే తమ తదుపరి స్పందన ఉంటుందని వెల్లడించారు. ఈ మధ్యనే ఇరాక్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, తమ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకున్నారా లేదా అనేది నిర్థారణ కావల్సి ఉందన్నారు. అమెరికా కాన్సులేట్ వద్ధ పేలిన క్షిపణులతో తలెత్తిన పరిస్థితిని తెలియచేస్తూ శాటిలైట్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ కుర్దీస్థాన్ ఫోటోలతో వార్తలు వెలువరించింది. అమెరికా కాన్సులేట్ వద్దనే ఉన్న ఈ ఛానల్ ఆఫీసు కిటికి అద్దాలు పగలడం, కొంత మేర ధ్వంసం కావడం వంటి దృశ్యాలను ప్రసారం చేశారు. డమాస్కస్ వద్ద ఇరాక్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవలే ఇరాన్ హెచ్చరించింది. అప్పటి దాడిలో ఇరాన్ సైనికులు మృతిచెందారు. దీనిని తాము తేలిగ్గా వదిలిపెట్టేది లేదని ఇరాన్ స్పష్టం చేస్తూ వస్తున్న దశలోనే ఇప్పుడు ఇరాక్‌లోని అమెరికా ఎంబస్సీ వద్ద క్షిపణులు పడటం కీలకం అయింది.
ఇరాక్‌పై ప్రతీకార చర్యలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ స్వయం నిర్మిత ఫతే 110 క్షిపణులను ప్రయోగించిందని ఇరాక్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ క్షిపణి ఏ స్థాయిలో శక్తివంతం అయి ఉందనేది, ఇతర వివరాలను వెల్లడించలేదు. ఇప్పుడు జరిగిన దాడి అరాచకం, గర్హనీయం, ఇరాక్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే చర్య అని అమెరికా అధికారి ఒకరు స్పందించారు. ఇరాక్, సిరియాలలోని తమ స్థావరాలపై ఇటీవలి కాలంలో ఇరాన్ , ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాద శక్తుల నుంచి పలు రకాల భీకర దాడులు జరుగుతున్నాయని, వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవలే అమెరికా సైనిక దళాల ఉన్నత అధికారి ఒకరు ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇరాక్‌లో చాలాకాలంగా అమెరికా సేనలు తిష్టవేసుకుని ఉండటం, వ్యూహాత్మకంగా తమకు వ్యతిరేకంగా అమెరికా పావులు కదపడటం వంటి పరిణామాలతో ఇరాన్ ఆగ్రహంతో ఉంది. పలు మార్లు అమెరికాకు , ఇరాక్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలు వెలువరిస్తూ వస్తోంది. ఇప్పటి మిస్సైల్స్ దాడులను ఖండిస్తున్నట్లు, వీటిని ఎవరు జరిపారనేది తమకు తెలియనట్లు తాజాగా ఇరాన్ ఓ ప్రకటన వెలువరించింది.