ఇరాన్ మహిళలు అక్కడి మత నైతిక రాజ్య సంకెళ్ళను విరిచి పోగు లుపెడుతున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. అమెరికా ఆంక్షల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయి దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయి జన జీవనం అల్లకల్లోలం అతలాకుతలమై ఉంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక వస్త్ర ధారణ నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ మత ప్రభుత్వ నైతిక పోలీసులు వేధించడం అక్కడి మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొనేలా చేస్తున్నది. 22ఏళ్ల మహస అమినిని శిరోవస్త్రాన్ని(హిజాబ్) సవ్యంగా ధరించలేదన్న కారణంపై నైతిక దళాలు అరెస్టు చేసి వేధించడంతో ఆమె వారి కస్టడీలోనే మరణించిన ఉదంతం దేశమంతటా నిరసన ప్రదర్శనలకు దారి తీసింది.
ఈ ఘటన ఈ నెల 16న చోటుచేసుకున్నది. ఆమె అంత్యక్రియల రోజున అశాంతి చెలరేగింది. హిజాబ్ ధారణలో శిక్షణ ఇస్తుండగా గుండె పోటు వచ్చి ఆమె మృతిచెందినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కస్టడీలో పోలీసులు విచక్షణ లేకుండా కొట్టినందువల్లనే మృతి చెందినట్టు ఆమె తలిదండ్రులు బంధువులు అంటున్నారు. ఈ ఘటన రాజధాని టెహరాన్ సహా 30నగరాల్లో నిరస నోద్య మాన్ని మండించింది. వందలాదిమంది వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించడంతో పోలీసు లు తీవ్ర అణచివేతకు పాల్పడ్డారు. 36 మంది మరణించినట్టు వార్తలు చెబుతున్నాయి. వారిలో ఏడుగురు పోలీసులున్నారంటే ప్రతిఘటన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. మహిళలకు దన్నుగా పురుషులు పోరాటంలో విషేశ పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రదర్శనల్లో మహిళలు హిజాబ్‌లను పోగులు వేసి తగులబెట్టారు. అంటే వస్త్రధారణ విషయంలో తమపై ప్రభుత్వం జులుం చెలాయిస్తున్నదనే అభిప్రాయం వారిలో ఏర్పడిందని స్పష్టపడుతున్నది. అమ్మాయిలు 7వ ఏట నుంచి జుట్టు పూర్తిగా కప్పుకోకపోతే పాఠశాలకు అనుమతించబోరని, ఉద్యోగా లివ్వరని, ఈ లింగ వివక్ష రాజ్యంతో విసిగిపోయామని మసీహ్ అలినేజాద్ అనే మహిళా జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యానం గమనించదగినది.
మహస అమినిని పోలీసులు హతమా ర్చినందుకు నిరసనగా ఇరాన్ మహిళలు తమ జుట్టు కత్తిరించుకొన్న, హిజాబ్ లను మంటల్లో వేసిన దృశ్యాల విడియోలను ఆమె సోషల్ మీడియా లో ఉంచారు. మత నియమాల ప్రకారం జుట్టును పూర్తిగా కప్పుకోని స్త్రీలను అక్కడ అవమానిస్తారు, అరెస్టు చేస్తారు. ఈ మధ్య హక్కుల ఉద్యమకారులు దీనికి వ్యతిరేకంగా మహిళలను సమీకరిస్తున్నారు. హిజాబ్ ధారణ మానుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుత ప్రదర్శనలో మత నియంత అయతుల్లా అలీ ఖమేనీ, హతుడైన రివల్యూషనరీ గార్డుల మాజీ కమాండర్ ఖాసీమ్ సులేమాన్ చిత్రపటాలను తగులబెట్టారు. శాంతియుత ప్రదర్శనల మీద ప్రభుత్వం బుల్లెట్లు ప్రయోగిస్తున్నదని ఇరాన్ మానవహక్కుల సంఘం డైరెక్టర్ ప్రకటించారు.ప్రదర్శకుల, హక్కుల కార్యకర్తల సామూహిక అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు.
ఇదంతా ఇరాన్ శత్రువులు పన్నిన కుట్రేనని పోలీ సులు ఆరోపిస్తున్నారు.’ఇది శత్రువు కుట్ర, దానిని భగ్నం చేశాం’ అని అత్యంత శక్తిమంతమైన రివొల్యూషనరీ గార్డు పోలీసులు ప్రకటించారు. శత్రువు అంటే వారి ఉద్దేశంలో అమెరికాయే. దేశంలో భావప్రకటన స్వాతంత్య్రం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అన్నారు, అయితే హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలను ఆయన ఖండించారు. 2019లో పెట్రోల్ ధరలు అసాధార ణంగా పెంచివేసినప్పుడు తీవ్ర నీరసనోద్యమం చెలరేగింది. ఆ స్థాయిలో ఇరాన్ ప్రజలు మళ్ళీ ఇప్పుడు తిరగబడుతున్నారు. అది ఆర్ధిక నిరసన కాగా ఇది సామాజికమైనది. స్త్రీల నుంచి వెల్లువెత్తినది. దీని ప్రభావం అక్కడి సమాజంపై తీవ్రంగా ఉంటుంది.1979 లో షా ల పాలనపై మతాధిపతుల సారథ్యంలో విప్లవం విజయవంతమైన తర్వాత అప్పటివరకు అక్కడ మహిళలు అనుభవిస్తూ వచ్చిన స్వేచ్ఛలు హరించుకుపోయాయి. వాస్తవానికి ఇరాన్ మహిళలు 19 శతాబ్దిలోనే హక్కుల సాధనకు ఉద్యమించారు. షాల పాలన దానిని ప్రోత్సాహించింది.
బురఖా లేకుండా మహిళలు బయటకు వచ్చి పనిపాట్లలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా దన్నుగా నిలించింది. అయతుల్లా ఖొమేనీ ఆదిపత్యానికి రావడంతో అన్నీ కోల్పోయారు. 1979లో బురఖాను తిరిగి అధికారికంగా ప్రవేశపెట్టారు. మారిన కాలానికి అనుగుణంగా మతాలు కూడా సంస్కరణలను చేపట్టాలి. స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించాలి. ఆడవారు అణచివేతకు మాత్రమే అర్హులనే నిరంకుశ పోకడకు స్వస్తి చెప్పాలి. అంతటా ప్రజాస్వామ్య స్వేచ్ఛ పురివిప్పుతుంటే మహిళను అణగదొక్కే సామాజిక నిరంకుశత్వాలు మనజాలవు మన దేశానికీ ఇది వర్తిస్తుంది. ఇక్కడకూడా సంపద సృష్టి కృషిలో మహిళల పాత్ర తగినంతగా లేదు స్త్రీ బాగా ఉన్నచోటనే సమాజం ముందడుగువేస్తుంది.