Wednesday, January 22, 2025

ఇరాన్ మహిళా నేత నర్గెస్‌కు నోబెల్ శాంతి

- Advertisement -
- Advertisement -

హక్కుల కోసం ప్రతిఘటన ఆమె సొంతం ఆసాంతం
అణచివేతల వ్యతిరేక ఉద్యమాలతో జైలుపాలు
కారాగారం నుంచి కూడా నిరసనల కలం

ఒస్లో : మహిళల హక్కుల కోసం న్యాయపోరాట పటిమలగల ఇరాన్ మహిళ నర్గెస్ మొహమ్మదికి ఈ ఏటి 2023 నోబెల్ శాంతిపురస్కారం దక్కింది. స్వీడిష్ రాయల్ అకాడమీ తమ నోబెల్ పురస్కారాల విజేతల ప్రకటనల్లో భాగంగా శుక్రవారం శాంతిపురస్కార విజేతను ప్రకటించింది. నిర్బంధాలు పలు రకాల బెదిరింపులకు తలొగ్గక ఆమె ఉద్యమిస్తూ ఇప్పుడు జైలులో ఉన్నారు. మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం, మరణశిక్షలకు వ్యతిరేకంగా ఈ మహిళా ఉద్యమకర్త సంవత్సరాల నుంచి ఇరాన్‌లో అలుపెరుగని పోరు సాగిస్తున్నారు.

13 సార్లు అరెస్టులు, ఐదుసార్లు జైలు నిర్బంధాల జీవిత ఘట్టాలతో కూడిన 51 సంవత్సరాల నర్గెస్ మొహమ్మది తన ఉద్యమ పంథాలో ముందుకు సాగుతున్నారు. తన ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే ఏండ్ల తరబడి కటకటాల వెనుక ఉన్నారు. ఒస్లోలో ఈ నోబెల్ కమిటీ అధ్యక్షులు బెరిట్ రియిస్ అండర్సెన్ ఈ శాంతి పురస్కార ప్రకటన చేశారు. ఇరాన్‌లో హక్కుల కోసం సాగుతోన్న ఉద్యమంలో ఓ కీలక ఘట్టానికి ఈ శాంతిపురస్కారం తొలి, అద్వితీయ గుర్తింపుగా నిలుస్తుంది. ఇందుకు తిరుగులేకుండా నాయకత్వం వహిస్తున్న నార్గిస్ ఈ శాంతి పురస్కారం ప్రకటిస్తున్నామని అండర్సెన్ తెలిపారు. గతంలో పలుమార్లు జైలుపాలయిన ఈ నేత ఇప్పుడు తన ఉద్యమానికి ఫలితంగా టెహ్రాన్‌లోని అత్యంత కరడుగట్టిన కారాగారం ఎవిన్ ప్రిజన్‌లో బందీగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా 2019లో చేపట్టిన నిరసనలలో మృతి చెందిన ఓ వ్యక్తి సంస్మరణ సభలో పాల్గొన్నందుకు ఆమెను 2021లో జైలుకు పంపించారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని దక్కించుకున్న మహిళలలో నర్గెస్ 19వ మహిళగా నిలుస్తారు. కాగా ఇరాన్ నుంచి నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్న రెండో మహిళ అవుతారు. 2003లో మానవ హక్కుల ఉద్యమకర్త షిరిన్ ఎబాదికి ఈ శాంతి బహుమతి దక్కింది. అణచివేతలు ఎక్కడ తలెత్తినా వాటిని ప్రతిఘటించే తత్వం గల నార్గిస్ పోలీసు కస్టడీలో మృతి చెందిన 22 ఏండ్ల యువతి మాసా అమిని ఉదంతం తరువాత చెలరేగిన దేశవ్యాప్త ఉద్యమంలోనూ పాలుపంచుకున్నారు.

అప్పుడు కూడా నార్గిస్ జైలు పాలయ్యారు. మాసా పోలీసు కస్టడీ మృతి దేశంలో చలామణిలో ఉన్న మతప్రవక్తల రాజ్యపు థియోక్రసీకి పెద్ద సవాలుగా అప్పట్లో ఉద్యమం చెలరేగింది. ఈ దశలో సాగిన అణచివేత చర్యలలో 500 మంది వరకూ మృతి చెందారు. భద్రతా బలగాల వేటలో 22000 మంది వరకూ అరెస్టు అయ్యారు. అప్పట్లో నర్గెస్ జైలుపాలయినప్పటికీ తన ఉద్యమ దీక్షను ఆపలేదు. జైలులో నుంచి న్యూయార్క్‌టైమ్స్‌కు ఆర్టికల్స్ పంపించారు. ‘ ఈ ప్రభుత్వానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అందులో కీలక విషయం నిర్బంధకాండతో ప్రతిఘటన ఆగదనే విషయం. మాలో ఎంత మంది చెరలోకి వెళ్లితే అంతే బలంగా మేము తయారవుతాం’ అని ఓ దశలో ఆమె స్పందించారు. ఇప్పుడు ఈ ఇరాన్ మహిళకు శాంతిపురస్కార ప్రకటనపై అధికారిక ఇరానీ టీవీ , ఇతర మీడియాల నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు.

ఆమె గురించి పలు అంశాలు
మహిళపై పలు ఆంక్షల ఇరాన్‌లో పుట్టిన నర్గెస్ విద్యార్థినిగా ఉన్ననాటి నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె కొంతకాలం పత్రికలకు కాలమిస్టుగా ఉన్నారు. నోబెల్ శాంతి పురస్కార విజేత షిరిన్ స్థాపించిన డిఫెండర్స్ ఆప్ హ్యుమన్ రైట్స్ (డిహెచ్‌ఆర్‌సి) సెంటర్‌లో 2003లో చేరారు. తరువాత ఈ సంస్థకు ఉపాధ్యక్షురాలు అయ్యారు. జైల్లో ఉన్నప్పుడు కూడా తన ఉద్యమాలను సాగించిన నార్గిస్ ప్రత్యేకించి జైళ్లల్లో మహిళా ఖైదీల పట్ల లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరుసల్పారు. జైలులోనూ ఆమెపై పలురకాల ఆంక్షలు విధించారు.

ఎవరిని కలువనివ్వకుండా అడ్డుకున్నారు. 2018లో ఆమెకు అండ్రీ సఖరోవ్ ప్రైజ్ లభించింది. పెన్ అమెరికా పురస్కారం కూడా వచ్చింది. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇతర పురస్కారాలకు భిన్నంగా స్టాక్‌హోంలో కాకుండా ఒస్లోలో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ సంబంధిత కమిటీ స్వతంత్రమైన ప్యానెల్‌గా ఉంది. దీనిని నార్వే పార్లమెంట్ ఏర్పాటు చేసింది. నోబెల్ శాంతి పురస్కారానికి పారితోషికంగా 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ అంటే 1 మిలియన్ డాలర్ల నగదు, 18 క్యారెట్ల స్వర్ణ పతకం , ఓ ప్రశంసా పత్రం డిసెంబర్‌లో జరిగే అవార్డు ప్రదాన సభలో అందిస్తారు.

ఇప్పటివరకూ అందిన శాంతి పురస్కారాలు
గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఉక్రెయిన్, బెలారస్, రష్యాలకు చెందిన హక్కుల కార్యకర్తలకు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఈ పురస్కారం గెల్చుకున్న వారిలో నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా, మిఖాయిల్ గొర్బచేవ్, అంగ్ సాన్ సూ సూకీ ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి కూడా అవార్డు అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News