Saturday, January 18, 2025

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడి.. విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడి
విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు
భగ్గుమన్న పశ్చిమాసియా ప్రాంతం
రంగంలోకి దిగుతోన్న అమెరికా
దెబ్బకు దెబ్బ అన్న ఇరాన్
ప్రతిదాడికి రెడీ అవుతున్న ఇజ్రాయెల్
నెతన్యాహూ బైడెన్ కీలక చర్చలు
జెరూసలెం/ టెహరాన్: పశ్చిమాసియా నెగడు మరింతగా రగులుకుంది. 24 గంటల హెచ్చరికల గడువు ముగిసీముగియకముందే శక్తివంతమైన దేశం ఇరాన్ తన సమీప చిరకాల ప్రత్యర్థి దేశం పవర్‌ఫుల్ సైనికశక్తి గల ఇజ్రాయెల్‌పై ఆదివారం ఉదయమే విరుచుకుపడింది.ఇరాన్ రెవెల్యూషనరీ సేనల భారీ సమరసన్నాహాక సంకేతాల నడుమ ఇరాన్ ఏకంగా 300 డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. ఇవన్నీ ప్రధానంగా ఇజ్రాయెల్ సైనిక, అణుస్థావరాలు, రాజధాని టెల్ అవీవ్ లక్షంగా నింగిలో మెరుపులు ఝుళిపిస్తూ, భీకరశబ్ధాలతో విరుచుకుపడ్డాయి. వందలాది క్రూయిజ్ మిస్సైల్స్‌ను కూడా ఇరాన్ రంగంలోకి దింపింది. ఓ వైపు ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల దశలో ప్రపంచ దేశాలు రెండుగా కూటములుగా సమీకరణలు సంతరించుకుంటున్న దశలోనే ఇరాన్ భీకర దాడులు జరిగాయి. తమది దెబ్బకు దెబ్బ యుద్ధం అని, ప్రతీకార దాడి అని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నుంచి సాగిన భీకర సైనిక దాడులను ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెనువెంటనే నిర్థారించాయి.

ఇరాన్ నుంచి 300కు పైగా దాడులు జరిగాయని అయితే ఇందులో 99 శాతం డ్రోన్లు, మిస్సైల్స్‌ను తమ సేనలు దెబ్బతీశాయని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ప్రకటించాయి. రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ సిరియాలో దాడికి దిగడం, అక్కడి ఇరాన్ దౌత్యకార్యాలయం భవనంపై జరిగిన ఘటనలో ఇద్దరు ప్రముఖ ఇరాన్ సైనికాధికారులు, జనరల్స్ హోదాలోని వారు చనిపోవడంతో ఇరాన్ భగ్గుమంది. అయితే ఈ చర్యకు పాల్పడింది తాము కాదని, ఈ ప్రాంతంలోని ఇతరత్రా శక్తులని ఇజ్రాయెల్ ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు సంకల్పించింది. అయితే మధ్యలో పవిత్ర రంజాన్ మాసం రావడంతో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. మధ్యలో అమెరికాకు కూడా ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇది తమకు ఇజ్రాయెల్‌కు నడుమ పోరు అని, ఇందులో అమెరికా తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షులు జో బైడెన్‌కు హెచ్చరికలు పంపించింది.

ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ నాటి నుంచి కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు నడుమ పచ్చగడ్డి భగ్గుమనే ఉద్రిక్తతలు ఉంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల నడుమ ఇది డైరెక్ట్ అటాక్ దశకు చేరింది. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా ఈ దాడికి తమ ప్రతిదాడి తీవ్రస్థాయిలోనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇరాన్ తమ దేశానికి పాత శత్రువు. ఈ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని, ఈ క్రమంలో ఇక తమ ప్రతిచర్య తప్పదని ఆదివారం ఆయన ఇరాన్‌కు హెచ్చరికలు వెలువరించారు. ఇరాన్ నుంచి ఇటీవలి కాలంలో తమ దేశంపై ప్రత్యక్ష దాడి ఉంటుందని నిర్థారించాం,ఈ క్రమంలోనే తమ దేశ అత్యంత శక్తివంతమైన సైనిక బలగం ఐడిఎఫ్ సర్వం సన్నద్ధంగా ఉందన్నారు. ఇజ్రాయెలీలు కూడా ధైర్యంగా నిలుస్తున్నారని చెప్పారు.

తమది వ్యూహాత్మక విజయం: ఇజ్రాయెల్
ఇరాన్ తలపెట్టిన ఇప్పటి దాడులను పూర్తిగా చిత్తుచేశామని, ఇప్పుడు తాము పాటించిన సంయనం, ఎదురుదాడులు పూర్తి స్థాయిలో తమకు వ్యూహాత్మక విజయం తెచ్చిపెట్టాయని ఆదివారం ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ వార్తా సంస్థలతో మాట్లాడారు. ఇరాన్ 170 డ్రోన్లను, 30కు పైగా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. 120 వరకూ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూడా వాడిందని వీటిలో చాలా వరకూ ఇజ్రాయెల్ దేశ భూభాగంలోకి దూసుకువచ్చాయని ఈ క్రమంలో ఓ వైమానిక స్థావరానికి స్వల్ప స్థాయి నష్టం వాటిల్లిందని వివరించారు. కాగా దాడుల క్రమంలో ఇప్పటికైతే తీవ్రస్థాయి ప్రాణనష్టం, ఆస్తినష్టం వార్తలు వెలువడలేదు. అయితే దక్షిణ ఇజ్రాయెల్‌లోని బెడౌనీ అరబ్ టైన్‌లో ఏడు సంవత్సరాల బాలిక తీవ్రంగా గాయపడిందని వివరించారు. మిస్సైల్స్ దాడిలోనే ఈ బాలిక క్షతగ్రాతిత అయిందని చెప్పారు.

కాగా తమ విల్లంబ స్థాయి ప్రతిఘటన వ్యవస్థ బాగా పనిచేసిందని సైనికాధికారి తెలిపారు. చాలావరకూ డ్రోన్లను, మిస్సైల్స్‌ను సరిహద్దులకు ఆవలనే చిత్తు చేయడం లేదా నిరోధించడం జరిగిందని తెలిపారు. తమ దేశ యుద్ధ విమానాలు పలు డ్రోన్లు, మిస్సైల్స్‌ను మధ్యలోనే అటకాయించినట్లు డేనియల్ వెల్లడించారు. శత్రు దాడులను తమ వ్యూహాత్మక భాగస్వామ్య శక్తుల సాయంతో దెబ్బతీశామని వివరించారు. ఇప్పటికే అమెరికా తమ సైనిక విమానాలను, వార్‌షిప్‌లను తరలించిందని వివరించారు. ప్రత్యేకించి మిస్సైల్ డిఫెన్స్ డిస్ట్రాయర్స్ వల్ల మంచి ఫలితం కల్గిందన్నారు. ఆదివారం ఉదయమే అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో సంభాషించారు. పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి స్థాయి వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ప్రకటించారు.

ఇరాన్ దాడి అసాధారణం …తక్షణమే జి7 సమావేశంఫ: బైడెన్ 
ఆదివారం ఉదయమే ఇజ్రాయెల్ ఇరాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షలు జో బైడెన్ స్పందించారు. ఇరాన్ చర్య గర్హనీయం అన్నారు. పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామని, ఇది అసాధారణ చర్య అయినందున వెంటనే ఈ అనాగరిక యుద్ధకాండను ఎదుర్కొనేందుకు తక్షణ రీతిలో జి 7 నేతల సమావేశానికి పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇరాన్‌పై తమ మిత్రపక్షాలతో కలిసి సమన్వయ రీతిలో ప్రతిస్పదన ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ రక్షణ, భద్రతలకు అమెరికా మద్దతు ఉంటుంది. ఈ దిశలోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి అన్ని సైనిక వనరులను తరలించారని తెలిపారు. ఎప్పటికప్పుడు తాను ఇజ్రాయెల్ నేతలతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

బ్రిటన్ నుంచి జెట్ ఫైటర్స్
ఇరాన్ దాడులను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఖండించారు. ఇది అరాచకం అని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో తమ దేశం ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందన్నారు. వెంటనే ఈ ప్రాంతానికి తమ దేశం నుంచి జెట్ ఫైటర్స్‌ను తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టేందుకు పనికి వచ్చే బ్రిటన్‌కు చెందిన పలు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్‌ను ఆ ప్రాంతానికి పంపించారు. ఇరాన్ చర్య తెలివితక్కువతనంతో సాగిందని బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాంట్‌షాప్స్ తెలిపారు.

మరో యుద్ధ భారం ప్రపంచం మోయలేదు: ఐరాస 
ఇరాన్ దాడుల ఘటన, పశ్చిమాసియా పరిణామాలపై వెంటనే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. ఇది చాలా దూకుడు చర్య అని ఖండించారు. ఇరాన్ జరిపిన భారీ స్థాయి దాడి గర్హనీయం అన్నారు. ఈ ప్రాంతం కానీ ఈ ప్రపంచం కాని ఈ దశలో మరో యుద్ధం పరిస్థితి భరించేంత స్థితిలో లేదని ప్రకటన వెలువరించారు. అన్నిపక్షాలు ఈ దశలో పూర్తి స్థాయిలో సంయమనం పాటించాల్సి ఉందన్నారు. ఓ వైపు రెండు ప్రధాన ప్రాంతాలలో ఘర్షణలు సాగుతున్నాయని, మరో ప్రాంతం కూడా ఈ ప్రజ్వలనల దశకు చేరుకుంటే పరిస్థితి దిగజారుతుందన్నారు. ఇరాన్ చర్య సరికాదని, దీనిని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. కాగా తమ బలగాలు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్షంగా ఎంచుకుని దాడికి దిగాయని ఐరాసలోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి బృందం ఐరాస ఉన్నతాధికారులకు తెలిపింది. ఐరాస ఛార్టర్‌లోని ఆర్టికల్ 51 పరిధిలోనే తాము ఆత్మరక్షణ దిశలోనే ఈ దాడికి దిగామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి తమకు దక్కిన అంతర్గత ప్రాదేశిక భద్రతా పరిరక్షణ పరిధిలోనిది అని వివరించారు.

ఆందోళన వద్దు జాగ్రత్తలు తప్పనిసరి: ఇండియన్లకు భారత ఎంబసి అడ్వయిజరీ
ఇరాన్ దాడులతో తలెత్తిన పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఇజ్రాయెల్‌లోని భారతీయులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇజ్రాయెల్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం ప్రకటన వెలువరించింది. అత్యంత కీలకమైన అడ్వయిజరీని వెలువరించింది. ఎప్పటికప్పుడు స్థానిక భద్రతా ఏర్పాట్లు ప్రోటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. పరిస్థితిని ఇక్కడి ఎంబసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఇప్పటికైతే ఏ దేశం కూడా తమ జాతీయులను ఇజ్రాయెల్ నుంచి తరలించడం లేదని , స్థానిక అధికారులు వెలువరించే సూచనలను పాటిస్తూ ఉండాలని తెలిపారు. అనవసర బయటి ప్రయాణాలు వద్దు, కుదురుగా ఉండాలి. ఎంబసీ వర్గాలతో ఇక్కడి భారతీయులు అవసరం అయినప్పుడు సంప్రదించవచ్చునని, ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు, ఓ నిర్థిష్ట వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పరిస్థితిని గమనిస్తూ, భారతీయుల రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News