Sunday, December 22, 2024

యూట్యూబర్ తైబా అల్‌అలీని చంపేసిన ఆమె తండ్రి

- Advertisement -
- Advertisement -

బాగ్దాద్: ఇరాక్‌లోని యూట్యూబర్ తైబా అల్‌అలీని ఆమె తండ్రి గొంతు నులిమి చంపేశాడు. కుటుంబ తగాదాల కారణంగా అతడాపనిచేశాడని స్థానిక మీడియా పేర్కొంది. దక్షిణ ఇరాక్‌లోని దివానియా గవర్నరేట్‌లో జనవరి 31న తైబా అల్‌అలీని ఆమె తండ్రి చంపేసినట్లు ఇరాక్ ఆంతరంగిక మంత్రి సాద్ మాన్ ట్వీట్ల ద్వారా తెలిపారు.

పోలీసులు తర్వాత కుటుంబ సభ్యులను కలిసారు. ‘ఆమె తండ్రే ఆమెను హత్య చేశాడన్న వార్త విని తర్వాత మేము ఆశ్చర్యపోయాము. తర్వాత అతడు తన నేరాన్ని అంగీకరించాడు’ అని సాద్ మాన్ తెలిపారు. తైబా అల్‌అలీ తుర్కీలో తన దైనందిన జీవితం గురించి వీడియోలు పోస్ట్ చేస్తుండేది. పైగా ఆమె వీడియోలు ఆమెకు ఆర్థిక దన్నుగా కూడా ఉండేది. తైబా 2017లో తకు కుటుంబంతో టర్కీకి వచ్చింది. కానీ వారి కుటుంబ సభ్యులు స్వస్థలానికి వెళ్లిపోయారు. కానీ ఆమె మాత్రం టర్కీలోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆమె అక్కడే నివసిస్తోంది. టర్కీలో ఆమె ఒంటరిగా బతకడం ఆమె తండ్రికి ఇష్టంలేదు. తండ్రికి, కూతురికి మధ్య జరిగిన వాదోపవాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వెలుగుచూసింది. అందులో ఆమె ఒంటరిగా ఉంటుండడం తనకు నచ్చలేదని ఆమెతో అన్నాడు. కాగా బాధితురాలు తన సోదరుడు తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తైబా అలీ వీడియోలు ఇరాక్‌లో చాలా ప్రచారం జరిగాయి.

తైబా హత్యను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ‘ఆనర్ క్రైమ్స్’ను చూసిచూడనట్లు ఉంటోందని విమర్శించింది. ‘మహిళలను, యువతులను రక్షించే చట్టాన్ని ఇరాక్ చేయనంత వరకు మనం ఇలాంటి భయానక హత్యలు చూస్తూనే ఉంటాం’ అని మిడిల్ ఈస్ట్ అండ్ ఉత్తర ఆఫ్రికా ఆమ్నెస్టీ డైరెక్టర్ అయా మజూబ్ అన్నారు. ఇరాక్‌లో 46 శాతం మంది మహిళలు గృహ హింసకు బాధితులు. మూడింట ఒకవంతు మహిళలు శారీరక, లైంగిక దౌర్జన్యానికి గురవుతున్నారు. 75 శాతం మంది మహిళలు మరింత దౌర్జన్యానికి గురవుతామోనని పోలీసులకు తెలుపడంలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News