మన తెలంగాణ/హైదరాబాద్: ఒడిశాలోని పూరీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే పూరి జగన్నాథ స్వామి రథ యాత్రకు వెళ్ళాలనుకునే హైదరాబాద్ వాసులకోసం ఐ.ఆర్.సి.టి.సి టూరిజం సంస్థ ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది. రెండు రాత్రులు, మూడు రోజుల గల ఈ యాత్రా ప్యాకేజిలో పూరీ తో పాటు కోణార్క్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల సందర్శన ఉంటుంది. జూన్ 30న ప్రారంభం కానున్న ఈ యాత్రలో ఫ్లైట్ టిక్కెట్లు, పూరి లో బస ఏర్పాట్లు, ఫుడ్, ఏసి వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సురెన్స్ కవరవుతాయి. ఈ యాత్ర మొదటి రోజు ఉదయం 6:30 గంటలకు పర్యాటకులు హైదరాబాద్ లో ఫ్లైట్ లో గంట ప్రయాణం తరువాత భువనేశ్వర్ చేరుకుంటారు.
అక్కడి నుండి పూరీకి బయలుదేరతారు. పూరిలో పర్యాటకులకు బస ఏర్పాట్లుంటాయి. హొటల్‌లో చెక్‌ఇన్ అయిన అనంతరం మొదట కోణార్క్‌కు బయలుదేరతారు. దారిలో చంద్రభాగ బీచ్ సందర్శన ఉంటుంది. అక్కడినుండి తిరిగి పూరి బయల్దేరతారు. రెండో రోజు ట్రిప్ లో పూరి జగన్నాథ స్వామి ఆలయ సందర్శన, రథ యాత్ర దర్శిస్తారు. అక్కడ సీటింగ్ ఏర్పాట్లతో పాటు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. రెండవ రోజు రాత్రి పూరిలోనే బస చేస్తారు. మూడో రోజు ధౌలీ స్థూపం, లింగరాజ స్వామి ఆలయ దర్శనం అనంతరం భువనేశ్వర్ కి బయలుదేరతారు.
భువనేశ్వర్ విమానాశ్రయం నుండి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి రాత్రి 7:40కి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. పర్యాటకులకు ఈ యాత్రలో కంఫర్ట్, డీలక్స్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.18,115/- కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,525/-, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,555/-.., డీలక్స్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,035/- కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,505/-, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,790/- గా ఐ.ఆర్.సి.టి.సి నిర్ణయించింది.