దక్షిణ భారతదేశ ప్రయాణికుల కోసం ఐఆర్‌సిటిసి స్పెషల్ ప్యాకేజీ
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గ్వాలియర్ టు భోపాల్ వరకు
హైదరాబాద్: దక్షిణ భారతదేశ పర్యాటకులను మధ్యప్రదేశ్‌లోని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైయిన్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో నడుపుతోంది. గ్వాలీయర్, ఝాన్సీ, ఖజురహో, విదిశ, సాంచీ, భోపాల్ ప్రాంతాలను సందర్శించేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఈ టూర్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణం చేయనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఈ టూర్ ఫ్యాకేజీని బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.10,200లు మాత్రమే. ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్యూరెన్స్ లాంటివి ప్రయాణికులకు వర్తించనున్నాయి.
ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలకు http://www.itctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు ఫిబ్రవరి 18న మధురైలో ప్రారంభమయి తెలుగు రాష్ట్రాల్లోని నెల్లూరు, విజయవాడ జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్‌లలో ఫిబ్రవరి 19న ఆగుతుంది. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం గ్వాలియర్ చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి 21వ తేదీన గ్వాలియర్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. గ్వాలియర్ ఫోర్ట్, మన్ మందిర్ ప్యాలెస్‌ను సందర్శించొచ్చు. రాత్రికి ఓర్చా చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన రాణీమహాల్, ఝాన్సీపోర్ట్, ఓర్చా ఆలయం, ఓర్చా ఫోర్ట్ సందర్శించొచ్చు. రాత్రికి అక్కడి నుంచి బయలుదేరాలి. ఫిబ్రవరి 23న ఉదయం ఖజురహో చేరుకుంటారు. రోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి అక్కడి నుంచి బయలుదేరి, ఫిబ్రవరి 24వ తేదీన విదిశకు చేరుకుంటారు. అక్కడ సాంచీస్థూపం, హలాలీ డ్యామ్‌ను సందర్శించిన తరువాత భోపాల్ బయలుదేరుతారు. రాత్రి భోపాల్‌లో బసచేసి ఫిబ్రవరి 25వ తేదీన భీమ్‌భక్త గుహలు, భోజ్‌పూర్ శివాలయం సందర్శించాలి. ఫిబ్రవరి 25వ తేదీన హబీబ్‌గంజ్‌లో బయలుదేరి ఫిబ్రవరి 26వ తేదీన వరంగల్, విజయవాడ జంక్షన్, నెల్లూరులో రైలు ఆగుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 27వ తేదీన మధురై చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుందని అధికారులు తెలిపారు.