కర్టిస్ డబుల్ హ్యాట్రిక్, అడైర్ మ్యాజిక్, రాణించిన డెలాని, నెదర్లాండ్స్ ఓటమి
అబుదాబి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ శుభారంభం చేసింది. గ్రూప్‌ఎలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంపేర్ అరుదైన హ్యాట్రిక్‌తో ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 15.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ కెవిన్ ఓబ్రియాన్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఆండ్రూ బాల్‌బ్రయిన్ కూడా నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఐర్లాండ్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్, గారెథ్ డెలాని అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.
ఇద్దరు పరత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. స్టిర్లింగ్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, డెలాని దూకుడును ప్రదర్శించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డెలాని 29 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు పాల్ స్టిర్లింగ్ ఒక ఫోర్, సిక్స్‌తో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కర్టిస్ కాంపేర్ 7(నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. దీంతో ఐర్లాండ్ ఘన విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ఆరంభంలోనే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ బెన్ కూపర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బాస్ డి లీడే కూడా నిరాశ పరిచాడు. ఒక ఫోర్‌తో 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
కర్టిస్ జోరు..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ తనపై వేసుకున్నాడు. అకెర్‌మన్ అండతో అతను స్కోరును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.అయితే ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో నెదర్లాండ్స్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. స్పీడ్‌స్టర్ కర్టిస్ కాంపేర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. పదొ ఓవర్ రెండో బంతికి అకెర్‌మన్ (11)ను కాంపేర్ ఔట్ చేశాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై ఐర్లాండ్ రివ్యూకు వెళ్లడంతో అకెర్‌మన్‌ను ఔట్ అయినట్టు తేలింది. తర్వాతి బంతికే రియాన్ టెన్ డొయెస్‌చెట్ (౦)ను ఎల్బీగా ఔట్ చేశాడు. తర్వాతి బంతికి స్కాట్ ఎడ్వర్డ్ (౦)ను పెవిలియన్ బాట పట్టించాడు. ఈ వికెట్ కూడా ఎల్బీ రూపంలోనే లభించింది. దీంతో కాంపేర్ ఖాతాలో అరుదైన హ్యాట్రిక్ చేరింది. ఇక నిలుగో బంతికి రోలేఫ్ వాండెర్‌మెర్వ్ (౦)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కాంపేర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ చేరింది. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను పడగొడితే దాన్ని డబుల్ హ్యాట్రిక్‌గా పరిగణిస్తారు.
మాక్స్ ఒంటరి పోరాటం..
మరోవైపు ఓపెనర్ మాక్స్ ఒంటరి పోరాటం చేశాడు. సహచరులు పెవిలియన్‌ను క్యూ కడుతున్నా అతను మాత్రం పోరాటం కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక కెప్టెన్ సిలార్ (21), వాన్ బిక్ (11) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 106 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు, కర్టిస్ నాలుగు వికెట్లు పడగొట్టారు.
బాక్స్ ఐటమ్
కర్టిస్ కాంపేర్ అరుదైన రికార్డు
ఐర్లాండ్ యువ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంపేర్ ట్వంటీ20 ప్రపంచకప్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌తో సోమవారం జరిగిన కర్టిస్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇంతకుముందు టి20 శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, అఫ్గానిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌లు మాత్రమే ఇలాంటి ఫీట్‌ను సాధించారు. ఇక మలింగ అయితే ఈ రికార్డును రెండు సార్లు తన పేరిట లిఖించి చరిత్ర సృష్టించాడు. ఇక టి20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా కాంపేర్ నిలిచాడు.
ఇక నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పదో ఓవర్‌ను వేసిన కాంపేర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. పదో ఓవర్‌లో రెండు, మూడు, నాలుగు, ఐదు బంతుల్లో కాంపేర్ వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో అకెర్‌మాన్ (11), రియాన్ టెన్ డొయెస్‌చెట్ (౦), స్కాట్ ఎడ్వర్డ్ (౦), రోలేఫ్ వాండెర్‌మెర్వ్ (౦)లను కాంపేర్ వెనక్కి పంపాడు. ఇందులో ఇద్దరు ఎల్బీగా ఔట్‌గా, ఒకరు క్యాచ్ ద్వారా, మరో బ్యాట్స్‌మన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కాంపేర్ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.