పూర్తి దౌత్య సంబంధాలకు అంగీకారం
ఐరిష్ ప్రధాని హారిస్ ప్రకటన
లండన్ : ఇజ్రాయెల్ మాటను తోసిరాజని ఐర్లాండ్ మంగళవారం పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. పాలస్తీనా గుర్తింపు యోచనను ఇజ్రాయెల్ ఇంతకు ముందు ఖండించింది. ఐర్లాండ్ ప్రభుత్వం మంగళవారం ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాలస్తీనా గుర్తింపు ప్లాన్‌ను ఆమోదించింది. ‘పాలస్తీనాను సార్వభౌమ, స్వతంత్ర దేశంగా ప్రభుత్వం గుర్తిస్తోంది.
డబ్లిన్, రామల్లా మధ్య పూర్తి దౌత్య సంబంధాల ఏర్పాటుకు అంగీకరించింది’ అని ఆ ప్రకటన తెలిపింది. ‘రామల్లాలో ఐర్లాండ్ పూర్తి రాయబార కార్యాలయం ఏర్పాటుతో పాటు పాలస్తీనాకు ఐర్లాండ్ రాయబారి నియామకం జరుగుతుంది’ అని ప్రభుత్వం తెలియజేసింది. శాంతి పరిరక్షణ ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ వెల్లడించారు. ‘ప్రపంచం మాట వినాలని, గాజాలో మానవతావాద సంక్షోభాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని హారిస్ ఒక ప్రకటనలో తెలిపారు.