లండన్ : ప్రముఖ ఐరిష్ రచయిత పాల్ లించ్ నవల ‘ ప్రాఫెట్ సాంగ్’ ఈ ఏటి మేటి బుకర్ ప్రైజును దక్కించుకుంది. లండన్‌లో జరిగిన బుకర్ ప్రైజ్ పోటీ తుది దశలో లండన్‌కు చెందిన భారతీయ సంతతి రచయిత చేత్నా మరూ తొలి నవల వెస్టర్న్ లైన్‌ను అధిగమించి ప్రాఫెట్ సాంగ్ మన్ననలు పొందింది. 2023 బుకర్ ప్రైజుకు ఎంపికైంది. 49 సంవత్సరాల రచయిత పాల్ లించ్ ఐర్లాండ్‌లో నెలకొని ఉన్న ఆధిపత్యవవాదం గురించి విశ్లేషించారు. దీనిని చాటేందుకు ఆయన ఓ కుటుంబ జీవన నేపథ్యం ఎంచుకున్నారు. ప్రజాస్వామిక విలువలు అడుగంటిపోతున్న ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో ఈ కుటుంబం ఎటువంటి బాధలు ఎదుర్కోవల్సి వచ్చింది?
అన్ని వ్యవస్థలలో ఆధిపత్య వాదం పెచ్చుమీరడం వల్ల జరిగే జీవిత సంక్లిష్టతలు వంటివి ఆయన తమ పుస్తకంలో రాశారు. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిగా ఈ రచయిత తమ పుస్తకంతో చాటుకున్నారు. ఇప్పటివరకూ బుకర్ ప్రైజ్ పొందిన వారిలో పాల్ ఐదవ ఐరిష్ రచయిత. సోమవారం ఇక్కడ బుకర్ ప్రైజు బహుకరణ జరిగింది. దీనిని శ్రీలంకకు చెందిన రచయిత , గత ఏడాది విజేత షెహన్ కరుణతిలక నుంచి స్వీకరించారు. ఇప్పుడు పలు ప్రాంతాలలో తలెత్తిన ఆధునిక కల్లోలాలను తన రచనలో ప్రస్తావించానని విజేత తెలిపారు. సిరియా సంక్లిష్టత, శరణార్థుల సంక్షోభాలు, దీనిపై పశ్చిమ దేశాల నిర్లిప్తత, పైగా సంక్షోభాల తీవ్రతను పెంచే వ్యూహాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతంగా మారుతున్నాయనే విషయాన్ని తాను ప్రస్తావించినట్లు బుకర్ ప్రైజర్ తెలిపారు.