అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఎపి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీకి వెళ్లిన సిఐడి బృందం టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో వున్న లోకేశ్ కు నోటీసులు అందజేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. 41ఎ కింద లోకేష్‌కు ఈ నోటీ సులు అందజేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎ14గా నారా లోకేశ్ వున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి.
వైసిపి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఎపి సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. దర్యా ప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఐపిసి. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సిఐడి గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఎ-1గా, నారాయణను ఎ-2గా పేర్కొన్న సిఐడి, నారా లోకేష్‌ను ఎ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఎసిబి కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సిఐడి ఆరోపించింది. తన తండ్రి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూసేకరణ కు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్‌లను నిందితులుగా ఎపి సిఐడి చేర్చింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.