Wednesday, January 22, 2025

60లక్షల ఎకరాలకు సాగునీరు

- Advertisement -
- Advertisement -

 

మనతెలగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి వాతావరణం అన్ని విధాలుగా అనుకూలిస్తోంది. ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగానే యాసంగి పంటలకోసం సాగునీటి ప్రణాళికను సిద్దం చేస్తోంది. మరో వారం పదిరోజుల్లో సాగునీటి ప్రణాళికకు తుది రూపు నిచ్చి ప్ర భుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ సారి కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రధాన జలశయాల్లో నీటి నిలువలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రా్రష్ట్రంలో ఉన్న 44వేల చెరువు ల్లో కూడా నీటి లభ్యత అందుబాటులో ఉంది. భూగర్బజల మట్టాలు కూడా గత ఏడాదితో పోలిస్తే భారీగానే వృద్ది కనిపిస్తోంది.ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఈ సారి యాసంగి పంటల విషయంలో అధికారులు సాగునీటికి ఢోకా లేదన్న ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో ఈ యాసంగికి 60లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

అయితే ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇచ్చేలా రైతుల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో గత ఏడాది యాసంగికి అన్ని రకాల పంటలు కలిపి అదను ముగిసే సరికి 66.56లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా అత్యధికశాతం వరిసాగులోకి వచ్చింది. వ్యవసాయశాఖ అంచనాల మేరకు యాసంగి పంటల విస్తీర్ణపు ప్రాధమిక అంచనాల్లో వరిసాగు 22.19లక్షల ఎకరాలు అంచనా వేసుకోగా, అదను ముగిసే సరికి 51.62లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. అంతకు ముందటేడాది కూడా ప్రాధమిక అంచానాలకు మించి వరిసాగు జరిగింది. 202223 యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రధాన ఆహారపంటలు, పప్పుధాన్యపంటలు, నూనెగింజ పంటలు పొగాకు, మిరప తదితర వాణిజ్య పంటలు , కూరగాయ పంటలు తదితర అన్ని రకాల పంటలు కలిపి 47.85లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ ప్రాధమికంగా అంచనా వేసింది.అందులో ప్రధానంగా వరిసాగు విస్తీర్ణం 33.53లక్షల ఎకరాలుగా అంచనా వేసింది.

సాగునీటికి అవసరాలకు 600టిఎంసీలు

ఈసారి రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి. నైరుతితోపాటు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గానే ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి పరివాహకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 840టిఎంసీల మేరకు ఉన్నట్టు నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేశారు.మిషన్‌భగీరథ ద్వారా రాష్ట్ర జనాభాకు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు ,డెడ్‌స్టోరేజి, నీటి ఆవిరి తదితర వాటిని దృష్టిలో ఉంచుకుంటే సాగునీటి అవసరాలకు నీటిలభ్యత ఎంత అన్నదానిపై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు.అధికారుల ప్రాధమిక అంచనాల మేరకు 600టిఎంసీల నీరు సాగునీటి అవసరాలకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.కృష్ణానది పరివాహకంగా జూరాల,కల్వకుర్తి, నెట్టెంపాడు,ఏఎంఆర్‌పి, నాగార్జునసాగర్, మూసి, బీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్‌తదితర ప్రాజెక్టులతోపాటు గోదావరి నది పరివాహకంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, దేవాదుల, కడెం, సింగూరు, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల కింద 38లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు, మధ్యతరహా, చిన్నతరహా కింద మరో 22లక్షల ఎకరాల అయకట్టు ఉంది.

నీటిపారుదల శాఖ పరిధిలోని 60లక్షల ఎకరాల్లో పంటల సాగుకు 600టిఎంసీల నీరు అవసరం ఉంది.అయితే వరిసాగుకు బదులు ఆరుతడి పంటలు సాగు చేస్తే నీటి వినియోగపు అవసరాలు మరింత విస్తీర్ణానికి పెంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ దిశగానే ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధ్యనత కల్పించనున్నట్టు చెబుతున్నారు. ఆరుతడి పంటల కింద వేరుశనగ,పొద్దుతిరుగుడు, మినుము, పెసర తదితర పంటల సాగును ప్రొత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.భూగర్బ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తే యాసంగిలో మంచి పంటల దిగుబడిని సాధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News